Manchu Brothers : వెండితెర పై ఫైట్ కు సిద్దమైన మంచు బ్రదర్స్
Manchu Brothers : మంచు సోదరుల (Manchu Brothers) మధ్య బాక్సాఫీస్ పోటీ. వ్యక్తిగతంగా నువ్వా నేనా అంటూ గొడవల మధ్య కనిపిస్తున్న మంచు విష్ణు (Manchu Vishnu ), మంచు మనోజ్ (Manchu Manoj)ఇప్పుడు
- By Sudheer Published Date - 01:57 PM, Tue - 18 March 25

టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన అంశం మంచు సోదరుల (Manchu Brothers) మధ్య బాక్సాఫీస్ పోటీ. వ్యక్తిగతంగా నువ్వా నేనా అంటూ గొడవల మధ్య కనిపిస్తున్న మంచు విష్ణు (Manchu Vishnu ), మంచు మనోజ్ (Manchu Manoj)ఇప్పుడు వెండితెరపైన కూడా తలపడనున్నారా? అనే ఉత్కంఠ సినీ వర్గాల్లో నెలకొంది. ఏప్రిల్ 25న మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన “కన్నప్ప” (Kannappa) ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్లు మొదలై, ప్రభాస్ సహా ప్రధాన తారాగణం పాల్గొనే భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ప్లాన్ చేస్తున్నారు. శ్రీ కాళహస్తిలో ఈ వేడుకను నిర్వహించాలని ప్రస్తుత ప్రతిపాదన ఉంది.
అదే రోజున మంచు మనోజ్ కీలక పాత్రలో నటించిన “భైరవం” (Bhairavam) విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. తొలుత ఈ సినిమాను జనవరిలో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ అనివార్య కారణాలతో వాయిదా పడింది. ప్రముఖ దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా తమిళ సూపర్ హిట్ “గరుడన్”కి రీమేక్. ఇందులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించగా, నారా రోహిత్, మంచు మనోజ్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ మూవీపై మేకర్స్ పూర్తి నమ్మకంతో ఉన్నారు.
ఇప్పుడు కన్నప్ప vs భైరవం పోటీ ఆసక్తికరంగా మారే అవకాశముంది. కన్నప్ప భారీ తారాగణం, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ క్యాస్టింగ్‌తో భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. మరి నిజంగా మంచు సోదరుల మధ్య బాక్సాఫీస్ వార్ జరగనుందా? లేదా చివరి నిమిషంలో ప్లాన్ మారుతుందా? అన్నది ఆసక్తిగా మారింది.