Delhi Chalo : కేంద్రంతో చర్చలు విఫలం.. ‘చలో ఢిల్లీ’కి బయలుదేరిన రైతులు
Delhi Chalo : ఇవాళే (ఫిబ్రవరి 13) రైతుల ‘చలో ఢిల్లీ’ మార్చ్ జరగబోతోంది.
- By Pasha Published Date - 07:11 AM, Tue - 13 February 24

Delhi Chalo : ఇవాళే (ఫిబ్రవరి 13) రైతుల ‘చలో ఢిల్లీ’ మార్చ్ జరగబోతోంది. దాదాపు 20వేల మంది రైతులు దేశ రాజధాని ఢిల్లీ బార్డర్లను ఇవాళ చుట్టుముడతారని అంచనా వేస్తున్నారు. దీంతో హస్తిన చుట్టూ ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. దాదాపు 5వేల మంది పోలీసులను మోహరించారు. రైతుల ట్రాక్టర్లు ఢిల్లీలోకి ప్రవేశించకుండా సరిహద్దు ప్రాంతాల్లోని రోడ్లను ఇనుప కంచెలు, ముళ్ల తీగలు, ఇనుప మేకులు, కాంక్రీట్ పిల్లర్లతో నింపేశారు. మరోవైపు చండీగఢ్ వేదికగా కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా నేతృత్వంలో టీమ్ రైతులతో రెండో విడత చర్చలు జరిపింది.
We’re now on WhatsApp. Click to Join
సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు దాదాపు ఐదు గంటలపాటు ఈ చర్చలు జరిగాయి. చర్చలు అసంపూర్తిగా ముగియడంతో ఇవాళ ఢిల్లీకి ర్యాలీగా(Delhi Chalo) బయలుదేరేందుకు రైతులు సిద్ధమయ్యారు. రైతుల ప్రధాన డిమాండ్ అయిన పంటలకు గరిష్ట మద్దతు ధరపై కేంద్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అన్ని పంటలకు కనీస మద్దతు ధరను చెల్లించేలా హామీ ఇచ్చే చట్టం, రైతు రుణమాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు అనే మూడు కీలక డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యుత్ చట్టం 2020 రద్దు, ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో మృతి చెందిన రైతులకు పరిహారం, రైతుల ఉద్యమం సందర్భంగా రైతులపై కేసుల ఉపసంహరణపై కేంద్రం, రైతు సంఘాలు ఒక అంగీకారానికి వచ్చాయి.
Also Read : Srisailam: శ్రీశైలం భక్తులకు గుడ్ న్యూస్, బస్ టిక్కెట్ తో స్వామివారి దర్శనం కూడా
మా మార్చ్ కొనసాగుతుంది : రైతు సంఘాల ప్రతినిధి
కేంద్ర మంత్రులతో సమావేశం ముగిసిన తర్వాత కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీకి చెందిన సర్వన్ సింగ్ పంధేర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఢిల్లీ చలో’ మార్చ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘రెండేళ్ల క్రితమే ప్రభుత్వం మా డిమాండ్‌లలో సగం రాతపూర్వకంగా నెరవేరుస్తామని కేంద్ర సర్కారు హామీ ఇచ్చింది.. సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని కోరాం. కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. ఇప్పటిదాకా మా డిమాండ్లను నెరవేర్చలేదు. కాలయాపన చేయడమే వాళ్లు పనిగా పెట్టుకున్నారు’’ అని ఆయన తెలిపారు. ఢిల్లీలో పాదయాత్రను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. సింఘు, తిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిరంగ సభలు, ట్రాక్టర్లు, ట్రాలీలు ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు నెల రోజుల పాటు నిషేధం విధించారు. 250కిపైగా రైతు సంఘాల మద్దతు కలిగిన కిసాన్ మజ్దూర్ మోర్చా, 150 రైతు సంఘాల వేదిక అయిన సంయుక్త కిసాన్ మోర్చా ఇవాళ చలో ఢిల్లీ నిరసనకు పిలుపునిచ్చాయి.