Fake SBI Branch : ఫేక్ ఎస్‌బీఐ బ్రాంచ్.. రూ.లక్షలు కుచ్చుటోపీ.. ఉద్యోగాలు అమ్ముకున్న వైనం
దీంతో పదిరోజుల్లోనే భారీగా డిపాజిట్లు(Fake SBI Branch) జమయ్యాయి.
- By Pasha Published Date - 02:25 PM, Thu - 3 October 24

Fake SBI Branch : ఆ నలుగురు బరి తెగించారు. ఏకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పేరిట ఫేక్ బ్యాంకు బ్రాంచీని ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని సాక్తి జిల్లా ఛాపొర గ్రామంలో ఈ ఫేక్ ఎస్‌బీఐ బ్రాంచీని ఏర్పాటు చేశారు.ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు దాదాపు 250 కి.మీ దూరంలో ఈ గ్రామం ఉంది. రేఖా సాహూ, మందిర్ దాస్, పంకజ్ సహా మరో వ్యక్తి కలిసి ఈ ఫేక్ బ్యాంకును ఏర్పాటు చేశారు. అయితే పది రోజుల కిందటే ఈ బ్యాంకు ఏర్పాటైంది. అచ్చం ఎస్‌బీఐ బ్రాంచీలాగే మొత్తం ఇంటర్నల్ సెట్టింగ్స్ చేశారు. కొత్త ఫర్నీచర్, ప్రొఫెషనల్ పేపర్స్, బ్యాంకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఎస్‌బీఐ లోగోతో డాక్యుమెంట్లను ప్రింట్ చేయించారు. దీంతో ఎంతోమంది ప్రజలు అది ఎస్‌బీఐ బ్రాంచే అనుకొని క్యూ కట్టారు.లక్షలాది రూపాయలను ఈ ఫేక్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. లావాదేవీలు మొదలుపెట్టారు. తమ బ్యాంకులో డిపాజిట్స్ చేసేవారికి సాధ్యమైనంత త్వరగా లోన్లు ఇస్తామని బుకాయించారు. దీంతో పదిరోజుల్లోనే భారీగా డిపాజిట్లు(Fake SBI Branch) జమయ్యాయి.
Also Read :Mysuru Dasara : మైసూరు దసరా ఉత్సవాలకు ‘అభిమన్యు’.. అటవీ ఏనుగులు వర్సెస్ పెంపుడు ఏనుగులపై చర్చ
మరోవిషయం ఏమిటంటే.. ఎస్‌బీఐ పేరుతో దాదాపు ఆరు నుంచి ఏడుగురు సిబ్బందిని రిక్రూట్ చేసుకున్నారు. ఈక్రమంలో ఉద్యోగం ఇచ్చేందుకు వారి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షల దాకా వసూలు చేశారు. ప్రతినెలా రూ.30వేల శాలరీ ఇస్తామని తెలిపారు. నిజంగా అది ఎస్‌బీఐ బ్రాంచే అనుకొని తాము డబ్బులిచ్చి మరీ జాబులో చేరామని బాధిత ఉద్యోగులు పోలీసులకు చెప్పారు.
స్కాం బయటపడింది ఇలా..
అయితే ఛాపొర గ్రామంలోని ఫేక్ ఎస్‌బీఐ బ్రాంచ్‌పై సమీపంలోని దాబ్రా గ్రామ ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్‌కు అనుమానం వచ్చింది. దీనిపై ఆయన బ్యాంకు అధికారుల ద్వారా పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. సెప్టెంబరు 27న పోలీసులు రంగంలోకి దిగి విచారణ నిర్వహించారు. దీంతో అది ఫేక్ ఎస్‌బీఐ బ్రాంచ్ అని తేలింది. ఈ ఫేక్ ఎస్‌బీఐ బ్రాంచ్‌ను ఏర్పాటు చేసేందుకు ఓ ఇంటిని నెలకు రూ.7వేలు చొప్పున అద్దెకు తీసుకున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ ఫేక్ బ్రాంచీలో ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగుల నుంచి భారీగానే డబ్బులు వసూలు చేశారని పోలీసులు చెప్పారు.