Hero MotoCorp : హీరో మోటోకార్ప్ ఛైర్మన్ రూ.25 కోట్ల ఆస్తులు అటాచ్
Hero MotoCorp : ప్రఖ్యాత పారిశ్రామిక దిగ్గజం, హీరో మోటోకార్ప్ ఛైర్మన్ పవన్ ముంజాల్‌కు చెందిన రూ.24.95 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ మరోసారి అటాచ్ చేసింది.
- By Pasha Published Date - 03:27 PM, Fri - 10 November 23

Hero MotoCorp : ప్రఖ్యాత పారిశ్రామిక దిగ్గజం, హీరో మోటోకార్ప్ ఛైర్మన్ పవన్ ముంజాల్‌కు చెందిన రూ.24.95 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ మరోసారి అటాచ్ చేసింది. మనీలాండరింగ్ అభియోగాలతో ఈ ఏడాది ఆగస్టులో రైడ్స్ చేసిన ఈడీ టీమ్స్.. ఆనాడు దాదాపు రూ.25 కోట్ల ఆస్తులను సీజ్ చేశాయి. ఈసారి సీజ్ చేసిన ఆస్తులను కలుపు కుంటే.. మొత్తం రూ.50 కోట్ల విలువైన ప్రాపర్టీస్ కేవలం నాలుగు నెలల వ్యవధిలో ఈడీ స్వాధీనం చేసుకున్నట్లయింది.
We’re now on WhatsApp. Click to Join.
పవన్ ముంజాల్ ఫారిన్ కరెన్సీని అక్రమంగా విదేశాలకు పంపారంటూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) నుంచి ఈడీకి గతంలో ఒక ఫిర్యాదు అందింది. దీని ఆధారంగానే ఈ ఏడాది ఆగస్టులో పవన్ ముంజాల్ , పలువురు ఆయన సన్నిహితుల నివాసాల్లో ఈడీ సోదాలు చేసింది. ఫారిన్ కరెన్సీని విదేశాలకు పంపిన అంశంతో ముడిపడిన ఆధారాలను సేకరించింది. అప్పట్లో రూ.25 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ప్రకటించింది. వేర్వేరు వ్యక్తుల పేర్ల మీద దాదాపు రూ.54 కోట్లు విలువైన ఫారిన్ కరెన్సీని విదేశాలకు చేరవేసి.. ఆ మొత్తాన్ని విదేశీ టూర్‌లకు వెళ్లిన టైంలలో పవన్ ముంజాల్ వాడుకునేవారని ఈడీ ఆరోపిస్తోంది. అందుకోసమే ఫారిన్ కరెన్సీ విలువకు సమానమైన ఆస్తులను ఇప్పటివరకు అటాచ్ చేసింది.
ఆ నిబంధనల ఉల్లంఘన..
ఫారిన్ కరెన్సీని అక్రమంగా విదేశాలకు తరలించే వ్యవహారాన్ని పవన్ ముంజాల్ రిలేషన్ షిప్ మేనేజర్, ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీతో కలిసి చక్కబెట్టేవారని ఈడీ వర్గాలు అంటున్నాయి. ఒక వ్యక్తి ప్రతి సంవత్సరం రూ.2 కోట్లకు మించిన ఫారిన్ కరెన్సీని దేశం నుంచి పంపకూడదని సరళీకృత రెమిటెన్స్ పథకం చెబుతోందని, ఆ నిబంధనలను ఉల్లంఘించేందుకే ఈవిధమైన అడ్డదారిని పవన్ ముంజాల్ ఉపయోగించారని ఈడీ(Hero MotoCorp) అంటోంది.