EVMs Vs Digvijay : చిప్ ఉన్న ఏ మిషన్‌నైనా హ్యాక్ చేయొచ్చు: దిగ్విజయ్
- Author : Pasha
Date : 05-12-2023 - 4:35 IST
Published By : Hashtagu Telugu Desk
EVMs Vs Digvijay : మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (EVMs)పై కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘చిప్ ఉన్న ఏ మిషన్‌నైనా హ్యాక్ చేయొచ్చు. 2003 నుంచి ఈవీంఎల ద్వారా ఓటింగ్‌ను నేను వ్యతిరేకిస్తున్నాను’’ అని ఆయన చెప్పారు. ‘‘భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ప్రొఫెషనల్ హ్యాకర్ల చేతిలో పెట్టేందుకు మనం అంగీకరించాలా ? ఇదొక ప్రాథమిక ప్రశ్న. అన్ని రాజకీయ పార్టీలు దీనికి పరిష్కారం కనుగొనాలి. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈసీఐ, సుప్రీంకోర్టును నేను కోరుతున్నాను’’ అని దిగ్విజయ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈవీఎంల అంశాన్ని ఆయన లేవనెత్తడం గమనార్హం.
We’re now on WhatsApp. Click to Join.
‘‘వాళ్ల సొంత ఊళ్లలో కనీసం 50 ఓట్లు కూడా రాలేదని కొందరు మాజీ ఎమ్మెల్యేలు నాకు ఫిర్యాదు చేశారు’’ అని కాంగ్రెస్ మరో సీనియర్ నేత కమల్‌నాథ్ చెప్పారు. ఇదెలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. పార్టీ సరైన ఫలితాలు రాబట్టకపోవడానికి కారణాలపై గెలిచిన అభ్యర్థులు, ఓడిన అభ్యర్థులతో చర్చిస్తామని చెప్పారు. ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నిస్తూ దిగ్విజయ సింగ్ చేసిన వ్యాఖ్యలను మధ్యప్రదేశ్ బీజేపీ కార్యదర్శి రజనీష్ అగర్వాల్ తోసిపుచ్చారు. కాంగ్రెస్ రాజకీయాలే ఆ పార్టీ ఓటమికి కారణమన్నారు.