Clash In Surat : సూరత్‌లో ఉద్రిక్తత.. గణేశ్ మండపంపైకి రాళ్లు రువ్విన అల్లరిమూకలు
నగరంలోని సయ్యద్‌పురా ప్రాంతంలో గణపతి మండపంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట(Clash In Surat) జరిగింది.
- Author : Pasha
Date : 09-09-2024 - 1:05 IST
Published By : Hashtagu Telugu Desk
Clash In Surat : గుజరాత్‌లోని సూరత్‌లో ఉద్రిక్తత ఏర్పడింది. నగరంలోని సయ్యద్‌పురా ప్రాంతంలో గణపతి మండపంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట(Clash In Surat) జరిగింది. అల్లరిమూకలు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనకు నిరసనగా స్థానికులు సమీపంలోని పోలీసు పోస్టును చుట్టుముట్టారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అక్కడికి పెద్దసంఖ్యలో పోలీసులు పంపారు. ఆందోళన తీవ్రతరం కావడంతో పోలీసులు నిరసనకారులపైకి లాఠీచార్జి చేశారు.
Also Read :Kaloji Narayana Raos Birth Anniversary : కాళోజీ జయంతి నేడే.. ఆ మహామనిషి జీవితంలోని కీలక ఘట్టాలివీ
గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ స్వయంగా ఆ గణేశ్ మండపం దగ్గరకు వచ్చి.. ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. సూరత్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గెహ్లాట్, సూరత్ మేయర్ దాఖేష్ మవానీ ఆయన వెంట ఉన్నారు.సయ్యద్‌పురా ప్రాంతంలోని గణేష్ మండపంపై రాళ్లు రువ్విన వారిలో ఆరుగురిని గుర్తించి, అరెస్టు చేశామని హోం మంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. వారితో పాటు మరో 27 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. సూరత్‌లోని అన్ని ప్రాంతాల్లో పోలీసు బలగాలు మోహరించాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని హోం మంత్రి వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే కాంతి బలార్ సంఘటనా స్థలానికి చేరుకొని నిందితులను వదిలిపెట్టబోమని హామీ ఇచ్చారు. వారిపై పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని చెప్పారు.పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూరత్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గెహ్లాట్ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు. కాగా, ఈ ఘటనను సూరత్‌లోని అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. సోదరభావానికి సూరత్ నగరం ప్రతీక అని చెబుతున్నారు. సూరత్ నగరానికి ఉన్న ఈ గొప్పతనాన్ని కాపాడాలని పిలుపునిస్తున్నారు.