Cyclone Dana : ముంచుకొస్తున్న ‘దానా’.. ఒడిశా, బెంగాల్‌లలో 10 లక్షల మంది తరలింపు
తమ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో(Cyclone Dana) విద్యాసంస్థలు, ఐసీడీఎస్ కేంద్రాలను ఈరోజు నుంచి అక్టోబర్ 26 వరకు మూసివేస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం ప్రకటించారు.
- By Pasha Published Date - 09:19 AM, Wed - 23 October 24

Cyclone Dana : దానా తుఫాను.. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని సముద్ర తీర జిల్లాలను వణికిస్తోంది. మంగళవారం సాయంత్రం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి శుక్రవారం (అక్టోబర్ 25న) తెల్లవారుజామున ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలను దాటే అవకాశం ఉంది. దానా తుఫాను ప్రభావంతో ఒడిశా, బెంగాల్ సముద్ర తీర ప్రాంతాల్లో గంటకు 100 నుంచి 110 మైళ్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈమేరకు హెచ్చరికను భారత వాతావరణ విభాగం (IMD) జారీ చేసింది. బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల సమీపంలో నివసించే దాదాపు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ మొదలైంది. వారికి పునరావాసం కల్పించేందుకు మల్టీపర్పస్ సైక్లోన్ షెల్టర్లు, ఫ్లడ్ షెల్టర్లు, ఇతర భవనాలను గుర్తించారు. వారి కోసం తాత్కాలిక సహాయ శిబిరాలకు సిద్ధం చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియలో ప్రభుత్వ అధికారులు, రెస్క్యూ దళాలు భాగస్వామ్యం అవుతున్నాయి. కోస్ట్ గార్డ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఇతర రెస్క్యూ దళాలు ప్రజలను సేఫ్ ఏరియాలకు పంపిస్తున్నారు.
Also Read :Rose Water Benefits : రోజ్ వాటర్ శీతాకాలంలో ఈ సమస్యల నుండి చర్మాన్ని కాపాడుతుంది..!
ప్రభావిత జిల్లాలు ఇవీ..
- ఐఎండీ అంచనా ప్రకారం.. ఒడిశాలోని 14 జిల్లాలపై దానా తుఫాను ప్రభావం ఉంటుంది. ఈ జాబితాలో అంగుల్, పూరీ, నయాగర్, ఖోర్ధా, కటక్, జగత్‌సింగ్‌పూర్, కేంద్రపారా, జాజ్‌పూర్, భద్రక్, బాలాసోర్, కియోంజర్, ధెంకనల్, గంజాం, మయూర్‌భంజ్ జిల్లాలు ఉన్నాయి.
- పశ్చిమ బెంగాల్‌లలో దానా తుఫాను ప్రభావం పడే జిల్లాల జాబితాలో.. దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు, పుర్బా మేదినీపూర్, తీర ప్రాంతాలతో పాటు పశ్చిమ మెదినీపూర్, బంకురా, ఝార్‌గ్రామ్, హుగ్లీ ఉన్నాయి.
Also Read :Pitch Report: పూణె పిచ్ రిపోర్ట్ ఇదే.. టాస్ కీలకం కానుందా?
- ముందుజాగ్రత్త చర్యగా తమ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో(Cyclone Dana) విద్యాసంస్థలు, ఐసీడీఎస్ కేంద్రాలను ఈరోజు నుంచి అక్టోబర్ 26 వరకు మూసివేస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.
- దానా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దాదాపు 150 రైళ్లు రద్దయ్యాయి. అనేక ఇతర రైళ్లను ప్రత్యామ్నాయ సురక్షిత రూట్లలోకి మళ్లించారు.
- దానా తుఫాను కారణంగా ఈ రోజు నుంచి ఈనెల 25వ తేదీ వరకు ఒడిశాలోని 14 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో సహా అన్ని విద్యా సంస్థలు మూసివేయనున్నారు.