Prashant Kishor : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రశాంత్ కిషోర్? ఇక హస్తవాసి పెరగనుందా?
ఒక్క విజయం.. ఒకే ఒక్క విజయం కోసం గత ఎనిమిదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ముఖం వాచిపోతోంది. ఒక్క రాష్ట్రాన్నయినా గెలుచుకోవాలని.. మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావాలని తహతహలాడుతోంది. అందుకోసం చేయని ప్రయత్నాలు లేవు.
- By Hashtag U Published Date - 11:05 AM, Wed - 20 April 22

ఒక్క విజయం.. ఒకే ఒక్క విజయం కోసం గత ఎనిమిదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ముఖం వాచిపోతోంది. ఒక్క రాష్ట్రాన్నయినా గెలుచుకోవాలని.. మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావాలని తహతహలాడుతోంది. అందుకోసం చేయని ప్రయత్నాలు లేవు. ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కీషోర్ తో మంతనాలు కూడా దానికోసమే. గత కొద్ది రోజులుగా సోనియాతోపాటు ముఖ్యనేతలతో పీకే భేటీ అవుతున్నారు. దీంతో కాంగ్రెస్ లో ఆయన చేరిక ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ఆశిస్తున్న ఆయనకు హైకమాండ్ త్వరలోనే తీపికబురు చెప్పే అవకాశం ఉంది.
పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన తరువాత ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికల నిర్వహణతోపాటు ఎవరితో పొత్తులు పెట్టుకుంటే రిజల్ట్ బాగుంటుంది అనే బాధ్యతలను పీకేకు అప్పగించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం ఎలా తీసుకురావాలి అన్నదానిపై సోనియాగాంధీ వరుసగా సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. రాహుల్, ప్రియాంకలతో ప్రత్యేకంగా సమావేశం అయి చర్చించారు.
కాంగ్రెస్ పార్టీ మేథో మథనం సదస్సు మే 13 నుంచి ప్రారంభం కానుంది. ఆలోపే పీకేకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే దిశగా రంగం సిద్ధం అవుతోందని తెలుస్తోంది. పీకే కూడా ఇప్పటికే తాను ఏం చేయాలనుకుంటున్నది, ఎలా చేయాలనుకుంటున్నది పార్టీ ముఖ్యనేతలకు వివరించారు. ఈ బ్లూప్రింట్ పై సంతృప్తి వ్యక్తం చేసిన హైకమాండ్.. పార్టీలో ఆయన కోరుకున్న పదవిని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ ఏడాది జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీకి గట్టి పోటీ తప్పదు.