Wikipedia : తప్పుల తడకగా వికీపీడియా పేజీలు.. కేంద్రం నోటీసులు
ఒకవేళ వికీపీడియాను(Wikipedia) ‘ఇంటర్ మీడియరీ’ కేటగిరీ నుంచి ‘పబ్లిషర్’ కేటగిరీలోకి మారిస్తే.. వికీపీడియా పేజీల్లో వచ్చే తప్పులకు నేరుగా ఆ సంస్థకు బాధ్యతను ఆపాదించవచ్చు.
- By Pasha Published Date - 01:12 PM, Tue - 5 November 24

Wikipedia : వికీపీడియాకు భారత ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ‘‘వికీపీడియా పేజీల్లో వాలంటీర్లు ఎంటర్ చేసిన సమాచారంలో తప్పులు ఉన్నాయని మాకు ఫిర్యాదులు వచ్చాయి. ఆ సమాచారం పక్షపాత వైఖరితో కూడుకున్నదిగా ఉందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు’’ అని భారత సర్కారు ఆ నోటీసుల్లో ప్రస్తావించింది. సమాచారాన్ని అందించే మాధ్యమంగా పనిచేస్తున్నందున వికీపీడియాను పబ్లిషర్‌గా ఎందుకు పరిగణించకూడదు అని వికీపీడియాను భారత సర్కారు ప్రశ్నించింది. ప్రస్తుతం వికీపీడియా అనేది ‘ఇంటర్ మీడియరీ’ కేటగిరీలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సోషల్ మీడియా కంపెనీలన్నీ కూడా ఇదే కేటగిరీలో ఉంటాయి.
Also Read :Private Property : ప్రైవేటు ప్రాపర్టీల స్వాధీనంపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు
‘ఇంటర్ మీడియరీ’ కేటగిరీలో ఉండే కంపెనీల వేదికల్లో ఒకవేళ వివాదాస్పద కంటెంట్ పబ్లిష్ అయినా నేరుగా చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. ఆ వేదికలో కంటెంటును పోస్ట్ చేసిన నెటిజన్‌ను గుర్తించి, అతడిపై మాత్రమే చర్యలు తీసుకోవాలి. ఒకవేళ వికీపీడియాను(Wikipedia) ‘ఇంటర్ మీడియరీ’ కేటగిరీ నుంచి ‘పబ్లిషర్’ కేటగిరీలోకి మారిస్తే.. వికీపీడియా పేజీల్లో వచ్చే తప్పులకు నేరుగా ఆ సంస్థకు బాధ్యతను ఆపాదించవచ్చు. దానిపై లీగల్‌గా ప్రభుత్వం ప్రొసీడ్ కావచ్చు. ఫలితంగా ఆ సంస్థ కార్యకలాపాల నిర్వహణ కష్టతరంగా మారుతుంది. అందుకే సోషల్ మీడియా కంపెనీలన్నీ ముందుజాగ్రత్త చర్యగా ‘ఇంటర్ మీడియరీ’ కేటగిరీలో ఉంటూ ఇలాంటి లీగల్ చిక్కుల నుంచి రక్షణ పొందుతుంటాయి. తప్పుడు పోస్టులు చేసే నెటిజన్లకు బాధ్యతను ఆపాదిస్తుంటాయి.
Also Read :Salman Khan : కృష్ణజింకలను వేటాడినందుకు సారీ చెప్పు.. లేదంటే 5 కోట్లు ఇవ్వు.. సల్మాన్‌కు వార్నింగ్
ఏఎన్ఐ వర్సెస్ వికీపీడియా.. కేసు వివరాలివీ
భారత్‌లోని ప్రముఖ వార్తాసంస్థ ఏఎన్ఐ (ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్)కి సంబంధించిన వికీపీడియా పేజీలో.. ‘‘ఇది భారత ప్రభుత్వం ప్రచారం కోసం వాడుకునే మాధ్యమం’’ అనే రాసి ఉంది. దీనిపై అభ్యంతరం తెలుపుతూ ఢిల్లీ హైకోర్టును ఏఎన్ఐ ఆశ్రయించింది. తమ కంపెనీ గురించి వికీపీడియా పేజీలో తప్పుడు సమాచారాన్ని ఎంటర్ చేసిన వారి వాలంటీర్ల వివరాలను అందించాలని వికీపీడియాను ఏఎన్ఐ డిమాండ్ చేసింది. గత శుక్రవారం కూడా దీనిపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు జరిగాయి. ‘‘వికీపీడియా ఇంటర్ మీడియరీగా భారతదేశంలో రిజిస్టర్ చేసుకుంది. ఏఎన్ఐ వికీపీడియా పేజీలోని సమాచారాన్ని ఎవరో మూడో వ్యక్తి (వాలంటీర్) ఎడిట్ చేశాడు. అతడి వివరాలను ఇచ్చేందుకు వికీపీడియా ఎందుకు జంకుతోంది ? వికీపీడియా పేజీలలోని సమాచారాన్ని ఇష్టానుసారంగా ఎడిట్ చేసే అవకాశమిస్తే ఎలా ? ఆవిధంగా చేసే వారిని కాపాడేందుకు వికీపీడియా ప్రయత్నించకూడదు’’ అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఈ లీగల్ యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వికీపీడియాకు నోటీసులు అందడం గమనార్హం.