Private Property : ప్రైవేటు ప్రాపర్టీల స్వాధీనంపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు
అన్ని రకాల ప్రైవేటు ప్రాపర్టీలను సామాజిక అవసరాల కోసం స్వాధీనం చేసుకోవడం కుదరదని దేశ సర్వోన్నత న్యాయస్థానం(Private Property) తేల్చి చెప్పింది.
- By Pasha Published Date - 12:41 PM, Tue - 5 November 24

Private Property : ప్రైవేటు ప్రాపర్టీ అనేది వ్యక్తిగతమైన అంశం. ఇది సదరు వ్యక్తి కష్టార్జితం. ఇలాంటి ప్రాపర్టీపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు ఉంటాయి ? సామాజిక ప్రయోజనం కోసం ప్రైవేటు ప్రాపర్టీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చా ? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇచ్చేలా సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును వెలువరించింది. ప్రైవేటు ప్రాపర్టీలను సామాజిక ప్రయోజనం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈమేరకు 7:2 మెజారిటీతో ఇవాళ తీర్పును వెలువరించింది. ప్రైవేటు ప్రాపర్టీలన్నీ సామాజిక అవసరాల కోసం స్వాధీనం చేసుకోవడం అనేది కుదరదని దేశ సర్వోన్నత న్యాయస్థానం(Private Property) తేల్చి చెప్పింది. 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనంలో భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, బివి నాగరత్న, సుధాన్షు ధులియా, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రా, రాజేష్ బిందాల్, సతీష్ చంద్ర శర్మ, అగస్టిన్ జార్జ్ మసీ ఉన్నారు. వీరిలో జస్టిస్ బీసీనాగరత్న పాక్షికంగా ఏకీభవించగా.. జస్టిస్ సుధాన్షు ధులియా విభేదించారు.
Also Read :Salman Khan : కృష్ణజింకలను వేటాడినందుకు సారీ చెప్పు.. లేదంటే 5 కోట్లు ఇవ్వు.. సల్మాన్‌కు వార్నింగ్
రాజ్యాంగంలోని అధికరణ 39(బీ) ప్రకారం అన్ని రకాల ప్రైవేటు ప్రాపర్టీలను సామాజిక పంపిణీ కోసం రాష్ట్రాలు స్వాధీనం చేసుకోవచ్చని గతంలో జస్టిస్ కృష్ణయ్యర్ ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు బెంచ్ తోసిపుచ్చింది.ఈ అంశంపై దాఖలైన 16 పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈమేరకు తాజా తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించిన పిటిషనర్లలో ముంబైకి చెందిన ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్(పీఓఏ) కూడా ఉంది. మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ చట్టంలోని చాప్టర్ VIII-Aను ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ వ్యతిరేకించింది. ఈ చాప్టర్‌ను 1986లో చేసిన రాజ్యాంగ సవరణ ద్వారా చట్టంలో పొందుపర్చారు. పునరుద్ధరణ ప్రయోజనాల కోసం నివాసితులు అభ్యర్థిస్తే.. సెస్డ్ భవనాలు, అవి నిర్మించిన భూమిని స్వాధీనం చేసుకునేందుకు రాష్టానికి ఈ చాప్టర్ అనుమతిని ఇస్తుంది. రాజ్యాంగంలోని అధికరణ 39(బీ)కి అనుగుణంగా ఈ చట్టాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో రూపొందించింది.