China Vs Arunachal : అరుణాచల్‌ప్రదేశ్‌లోని 30 ఏరియాలకు పేర్లు పెట్టిన చైనా
China Vs Arunachal : అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా మరోసారి విషం కక్కింది.
- Author : Pasha
Date : 01-04-2024 - 11:38 IST
Published By : Hashtagu Telugu Desk
China Vs Arunachal : అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా మరోసారి విషం కక్కింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని 30 ప్రాంతాలకు డ్రాగన్ దేశం 30 కొత్త పేర్లు పెట్టింది. ఈమేరకు వివరాలతో ఒక లిస్టును చైనా పౌర వ్యవహారాల శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ‘‘మే 1 నుంచి అరుణాచల్‌లోని ఆ 30 ఏరియాలను కొత్త పేర్లతోనే పిలవాలి. చైనా సార్వభౌమాధికార హక్కులకు క్లెయిమ్ చేసుకునే ప్రదేశాల పేర్లను విదేశీ భాషలలో పిలవకూడదు. వాటి పేర్లను విదేశీ భాషల నుంచి చైనీస్‌లోకి అనువదించకూడదు’’ అని ఆ లిస్టులో పేర్కొంది. ఈ మేరకు చైనా ప్రభుత్వ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. అరుణాచల్ ప్రదేశ్‌ను జాంగ్నాన్, దక్షిణ టిబెట్ అని పిలుస్తున్న చైనా(China Vs Arunachal).. అది చాలదన్నట్టుగా అరుణాచల్‌లోని ఏరియాలకు కూడా చైనీస్ భాషలో పేర్లు పెడుతుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join
అరుణాచల్‌లోని వివిధ ఏరియాలకు పేర్లు పెడుతూ ఇంతకు ముందు మూడు లిస్టులను చైనా విడుదల చేయగా.. ఇది నాలుగో లిస్టు. అరుణాచల్ ప్రదేశ్‌లోని 6 ఏరియాలకు కొత్త పేర్లు పెడుతూ మొదటి జాబితాను 2017లో చైనా పౌర వ్యవహారాల శాఖ విడుదల చేసింది. 2021లో అరుణాచల్‌లోని 15 ఏరియాలకు, 2023లో 11 ఏరియాలకు పేర్లు పెడుతూ మరో రెండు లిస్టులను డ్రాగన్ విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగమే అంటూ ఇటీవల అమెరికా చేసిన ప్రకటనతో అగ్గి మీద గుగ్గిలమైన చైనా.. తాజాగా భారత్‌ను కవ్వించేలా అరుణాచల్‌లోని 30 ఏరియాలకు పేర్లు పెట్టి లిస్టును రిలీజ్ చేసింది.
Also Read : Lybya: లిబియా ప్రధాని అబ్దుల్ హమీద్ నివాసంపై రాకెట్ గ్రనేడ్ దాడి
మార్చి 23న సింగపూర్ వేదికగా జరిగిన ఓ సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. ‘‘అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా పదేపదే చేస్తున్న వాదనలు హాస్యాస్పదంగా ఉన్నాయి. అరుణాచల్ అనేది భారతదేశంలో సహజ భాగం’’ అని స్పష్టం చేశారు. ఈవిధంగా పేర్లు పెట్టడంపై చైనా వితండవాదం చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో సాంస్కృతిక పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని, ఆ చర్యల్లో భాగంగానే అక్కడి ఏరియాలకు చైనీస్ పేర్లు పెడుతున్నామని డ్రాగన్ వాదిస్తోంది. గత నెలలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ అరుణాచల్ ప్రదేశ్ బార్డర్‌లో 13,000 అడుగుల ఎత్తైన సేలా టన్నెల్‌ను జాతికి అంకితమిచ్చారు. నాటి నుంచే భారత్‌పై చైనా నిప్పులు కక్కుతోంది. బార్డర్‌లో భారత్ పెద్దసంఖ్యలో సైనికులను మోహరిస్తోందని ఆరోపణలు గుప్పిస్తోంది.