Rajeev Kumar : చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కు తప్పిన పెను ప్రమాదం
Rajeev Kumar : హెలికాప్టర్ లో రాజీవ్ కుమార్ తో పాటు ఉత్తరాఖండ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ విజయ్ కుమార్ జోగ్దాండే కూడా హెలికాప్టర్‌లో ఉన్నారు. ఇద్దరు అధికారులతో పాటు పైటల్ క్షేమంగా ఉన్నారని, ఎలాంటి గాయాలు కాలేదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
- By Latha Suma Published Date - 03:12 PM, Wed - 16 October 24

CEC Rajeev Kumar : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం ఆయన మిలాంకు వెళ్తుండగా ఉత్తరాఖండ్ లోని పితోర్ గఢ్ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతమైన రాలంలో ప్రతికూల వాతావరణం కారణంగా అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్ లో రాజీవ్ కుమార్ తో పాటు ఉత్తరాఖండ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ విజయ్ కుమార్ జోగ్దాండే కూడా హెలికాప్టర్‌లో ఉన్నారు. ఇద్దరు అధికారులతో పాటు పైటల్ క్షేమంగా ఉన్నారని, ఎలాంటి గాయాలు కాలేదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
కాగా, సీఈసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ల్యాండ్ అయినట్టు అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని ఆది కైలాష్‌కు వెళ్తుండగా వాతావరణ ప్రతికూలత ఎదురైంది. దీంతో పైలట్ అత్యవసరంగా పితౌరాగఢ్‌లో హెలికాప్టర్‌ను ల్యాండ్ చేశారు. సీఈసీ మంగళవారంనాడు మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు 48 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలను ప్రకటించారు. మహారాష్ట్రలో నవంబర్ 20న, జార్ఖాండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో ఓటింగ్ జరుగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.