GST: జులై నెలలో జీఎస్టీ వసూళ్ల లెక్క ఇది !!
GST: జులై మాసంలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.96 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 7.5 శాతం పెరిగిన వసూళ్లుగా నమోదు అయింది
- By Sudheer Published Date - 07:17 PM, Fri - 1 August 25

దేశంలో జులై 2025 నెలకు గాను జీఎస్టీ (GST) వసూళ్ల గణాంకాలను కేంద్ర ప్రభుత్వం నేడు విడుదల చేసింది. ఇందులో పేర్కొనబడినట్లు, జులై మాసంలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.96 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 7.5 శాతం పెరిగిన వసూళ్లుగా నమోదు అయింది. దేశీయ లావాదేవీలు మరియు దిగుమతుల నుంచి వచ్చిన ఆదాయం ఈ వృద్ధికి ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. అయితే ఇటీవలి నెలల వృద్ధితో పోలిస్తే ఈ పెరుగుదల తక్కువగా ఉండడం గమనార్హం.
జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్-జులై (2025) కాలంలో మొత్తం రూ. 8.18 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇది గత ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ. 7.39 లక్షల కోట్లతో పోలిస్తే 10.7 శాతం అధికం. జులై ఒక్క నెలలో సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు రూ. 35,470 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ. 44,059 కోట్లు, ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ) రూ. 1,03,536 కోట్లు, సెస్ వసూళ్లు రూ. 12,670 కోట్లు అని కేంద్రం వెల్లడించింది.
Amazon Offers : అమెజాన్ లో దుమ్మురేపే ఆఫర్లు..మిస్ చేసుకుంటే మీకే నష్టం
ఈ నెల వసూళ్లు రూ. 1.96 లక్షల కోట్లుగా ఉన్నప్పటికీ, ఈ ఏడాది మొదటి త్రైమాసిక గణాంకాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. ఏప్రిల్‌లో రూ. 2.37 లక్షల కోట్లు, మేలో రూ. 2.01 లక్షల కోట్లు వసూలవగా, జులై నికర వసూళ్లు రీఫండ్‌లను తీసివేసిన తర్వాత రూ. 1,68,588 కోట్లకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే కేవలం 1.7 శాతం పెరుగుదల మాత్రమే. దీనికి ప్రధాన కారణం రీఫండ్‌లు భారీగా రూ. 27,147 కోట్లకు పెరగడమేనని అధికారులు వెల్లడించారు.
రాష్ట్రాల వారీగా గమనిస్తే.. త్రిపురా 41 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. మేఘాలయ 26 శాతం, మధ్యప్రదేశ్ 18 శాతం, బీహార్ 16 శాతం, ఆంధ్రప్రదేశ్ 14 శాతం వృద్ధి నమోదు చేసాయి. మహారాష్ట్ర రూ. 30,590 కోట్లతో 6 శాతం, కర్ణాటక 7 శాతం, తమిళనాడు 8 శాతం, గుజరాత్ 3 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మణిపూర్‌లో 36 శాతం, మిజోరంలో 21 శాతం వసూళ్లు తగ్గాయి. జులైలో తయారీ రంగం 16 నెలల గరిష్ఠ స్థాయిని చేరడం వల్ల దేశ ఆర్థిక ప్రగతికి ఇది తోడ్పడిందని నిపుణులు అభిప్రాయపడ్డారు.