NEET-UG : నీట్-యుజీ పరీక్షను రద్దు చేయలేం: సుప్రీంకోర్టు
వైద్య విద్యలో ప్రవేశం కోసం నీట్ యూజీ పరీక్షను మే 5న నిర్వహించిన విషయం తెలిసిందే.
- Author : Latha Suma
Date : 02-08-2024 - 2:08 IST
Published By : Hashtagu Telugu Desk
NEET-UG: నీట్ యూజీ 2024 పరీక్ష క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో సుప్రీంకోర్టు(Supreme Court) మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదని ఇటీవల కీలక తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అందుకుగల కారణాలను వివరిస్తూ మళ్లీ తీర్పు వెలువరించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లోపాలను ధర్మాసనం ఎత్తిచూపుతూ.. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే లోపాలను సరిదిద్దుకోవాలని చెప్పింది.
We’re now on WhatsApp. Click to Join.
నీట్ పేపర్ లీకేజీ(NEET Paper Leakage)లో ఎలాంటి వ్యవస్థీకృత ఉల్లంఘనలు చోటుచేసుకోలేదని.. పరీక్ష పవిత్రతను దెబ్బతీసేలా విస్తృత స్థాయిలో లీక్ జరగలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రశ్నపత్రం లీకేజీ ఝార్ఖండ్‌లోని హజారీబాగ్, బిహార్‌లోని పట్నా వరకే పరిమితమైందని.. దానిపై దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. అందుకే పరీక్షను రద్దు చేయాలనుకోలేదని.. అయితే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని.. విద్యార్థుల భవితకు సంబంధించిన అంశంలో ఇలాంటివి చోటుచేసుకోవడం సరికాదని హితవు పలికింది. ఈ సమస్యను కేంద్రం ఈ ఏడాదే పరిష్కరించాలని పేర్కొంటూ.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్టీయేదేనని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
కాగా, నీట్‌లో సంస్కరణలను పరిగణనలోకి తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పరిధిని పెంచుతున్నట్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం వివరణాత్మక తీర్పునిచ్చింది. మరోసారి పరీక్ష నిర్వహించాలన్న పిటిషన్‌ను తిరస్కరిస్తున్నప్పటికీ, పరీక్షలో అవకతవకలు జరిగినందున 44 మంది అభ్యర్థులు కచ్చితమైన మార్కులు సాధించారని చీఫ్ జస్టిస్ ప్రస్తావించారు. పరీక్షల నిర్వహణ వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు నియమించిన ఇస్రో మాజీ చీఫ్ కె.రాధాకృష్ణన్‌తో కూడిన కమిటీ సెప్టెంబర్ 30లోగా నివేదిక సమర్పించాల్సిందిగా గడువు విధించింది. పరీక్షా విధానాన్ని పటిష్టం చేసేందుకు సాంకేతికత పురోగతిని స్వీకరించేలా ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని రూపొందించడాన్ని కె.రాధాకృష్ణన్ కమిటీ పరిశీలించాలని సూచించింది.