Bomb threat : జైపుర్ క్రికెట్ స్టేడియానికి బాంబు బెదిరింపు మెయిల్
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, స్టేడియం అధికారులకు ఉదయం 9:13 గంటల సమయంలో ఆఈ-మెయిల్ వచ్చింది. ఆ మెయిల్‌లో “ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా మేం మీ స్టేడియంలో బాంబు పేలుడు జరిపేలా చూస్తాం. వీలైతే అందరినీ రక్షించుకోండి” అని హెచ్చరికలు వచ్చాయని తెలిపారు.
- By Latha Suma Published Date - 02:50 PM, Thu - 8 May 25

Bomb threat : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం ఘాటైన దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో నిర్వహించిన ఈ ప్రత్యేక చర్యలో భారత భద్రతా దళాలు దాదాపు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ విజయంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. సామాజిక మాధ్యమాల్లో ప్రజలు భారత సైన్యాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Read Also: Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’పై ట్రేడ్‌మార్క్ కోసం పోటీ.. రేసులో ‘రిలయన్స్’
అయితే ఇదే సమయంలో జైపుర్‌లో భద్రతా వ్యవస్థకు ఒక కొత్త సవాలు ఎదురైంది. జైపుర్‌లోని సవాయ్ మాన్ సింగ్ క్రికెట్ స్టేడియానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అక్కడ భద్రతా చర్యలు ముమ్మరంగా చేపట్టారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, స్టేడియం అధికారులకు ఉదయం 9:13 గంటల సమయంలో ఆఈ-మెయిల్ వచ్చింది. ఆ మెయిల్‌లో “ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా మేం మీ స్టేడియంలో బాంబు పేలుడు జరిపేలా చూస్తాం. వీలైతే అందరినీ రక్షించుకోండి” అని హెచ్చరికలు వచ్చాయని తెలిపారు.
ఈ ఘటన నేపథ్యంలో స్టేడియం ప్రాంగణాన్ని భద్రతా బలగాలు పూర్తిగా తనిఖీ చేస్తున్నాయి. బాంబు స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్‌లను రంగంలోకి దింపిన పోలీసులు, స్టేడియంలో ప్రతి మూలను గాలిస్తున్నారు. స్టేడియం అధికారులు తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు విచారణను ప్రారంభించారు. ఈ మెయిల్ ఎక్కడినుంచి వచ్చింది, ఎవరు పంపించారన్న దానిపై ఫోరెన్సిక్, సైబర్ టెక్నాలజీ ఆధారంగా విశ్లేషణ కొనసాగుతోంది.
ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ జరుగుతుండగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ లీగ్ మ్యాచ్‌లను ఈ వేదికపై ఆడుతోంది. మే 16న పంజాబ్ కింగ్స్‌తో చివరి లీగ్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో ఈ బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లకు వచ్చే ప్రేక్షకుల భద్రత పట్ల అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.