Kangana Ranaut: కంగనాను పార్టీలోకి స్వాగతిస్తాం.. కానీ..!
బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నానని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన ప్రకటనపై ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు.
- By Gopichand Published Date - 03:17 PM, Sun - 30 October 22

బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నానని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన ప్రకటనపై ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. పార్టీ తరఫున కంగనాకు స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. అయితే వారు ఏ హోదాలో ఉండాలనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. షరతులపై తాము ఎవరినీ తీసుకోమని స్పష్టం చేశారు.
నటి కంగనా రనౌత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేయాలని కంగనా తన కోరికను వ్యక్తం చేసింది. కంగనా ప్రకటనపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అదే కార్యక్రమంలో స్పందించారు. కంగనాను బీజేపీ స్వాగతిస్తున్నదని, అయితే ఎన్నికల్లో పోటీ చేయాలనేది సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని నడ్డా అన్నారు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నుంచి ప్రజలు కోరితే, బీజేపీ తనకు టిక్కెట్ ఇస్తే తాను పోటీ చేసేందుకు సిద్ధమని కంగనా శనివారం చెప్పారు. “పార్టీ కోసం పని చేయాలనుకునే ఎవరికైనా పార్టీలో స్థానం ఉంది. కంగనా బిజెపి టిక్కెట్‌పై పోటీ చేయాలా వద్దా అనేది నా ఒక్కడి నిర్ణయం కాదు. దాని కోసం పార్లమెంటరీ కమిటీ, ఎన్నికల సంఘం ప్రక్రియ ఉంది” అని నడ్డా అన్నారు.
షరతుల ఆధారంగా మేము ఎవరినీ పార్టీలో ఉంచడం లేదు. షరతులు లేకుండా రావాలని, అప్పుడే పార్టీ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని నడ్డా పార్టీ స్టాండ్‌ను వివరించారు. ఈ కార్యక్రమంలో నడ్డా మాట్లాడుతూ.. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 12న ఒకే దశలో పోలింగ్ జరగనుంది.డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.ఈ రాష్ట్రంలో అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రత్యక్ష పోరు నెలకొంది. 2017లో కోల్పోయిన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేస్తోంది.