BJP Chief Race : బీజేపీ చీఫ్ రేసులో ముందంజలో రామ్‌మాధవ్.. కిషన్‌రెడ్డి సైతం
ఆయన పూర్తి పేరు..వారణాసి రామ్‌మాధవ్(BJP Chief Race). ఈయన గతంలో బీజేపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు.
- By Pasha Published Date - 10:27 AM, Tue - 24 December 24

BJP Chief Race : కాబోయే బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు ? అనే దానిపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. మొత్తం మీద 2025 సంవత్సరంలో బీజేపీకి కొత్త ప్రెసిడెంట్ రావడం ఖాయం. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వంటి దిగ్గజ నేతలతో సన్నిహితంగా పనిచేసే అవకాశాన్ని కల్పించే ఈ కీలకమైన పోస్టు కోసం పెద్దసంఖ్యలోనే బీజేపీ సీనియర్ నేతలు పోటీపడుతున్నారు. సీనియారిటీతో పాటు సిన్సీయారిటీ కలిగిన నేతకు బీజేపీ చీఫ్‌గా పట్టం కట్టాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అయితే వారి మనసులు గెలుచుకోగలిగే నేత ఎవరు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read :Film Industry : ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిపోతుందా ? ఏం జరగబోతోంది ?
బీజేపీ చీఫ్ పదవి రేసులో రామ్‌మాధవ్ ముందంజలో ఉన్నారని తెలుస్తోంది. ఆయన పూర్తి పేరు..వారణాసి రామ్‌మాధవ్(BJP Chief Race). ఈయన గతంలో బీజేపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్‌లో సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన అనుభవం ఉండటం రామ్ మాధవ్‌కు కలిసొచ్చే అంశం. ఆర్ఎస్ఎస్ రికమెండేషన్‌తో ఆయనకు బీజేపీ చీఫ్ పదవి దక్కుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. దక్షిణాదికి చెందిన నేత కావడం రామ్ మాధవ్‌కు ఇంకో ప్లస్ పాయింట్. ఒకవేళ రామ్ మాధవ్ బీజేపీ చీఫ్ అయితే.. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా స్ట్రాంగ్‌గా ఉన్న బీజేపీ.. దక్షిణాదిలో విపక్షాల కంచుకోటల్ని బద్దలు కొట్టాలని భావిస్తోంది.
రామ్‌మాధవ్ నేపథ్యం ఇదీ..
రామ్ మాధవ్ ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంలో జన్మించారు. ఆయ ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడే జరిగింది. ఏపీలోనే ఎలక్ట్రికల్ డిప్లొమా చేశారు. అనంతరం కర్ణాటకలోని మైసూర్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చేశారు. తండ్రి, తల్లి ద్వారా బాల్యం నుంచే ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం వచ్చింది. రామ్‌మాధవ్ 1981లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. ప్రచారక్‌గా ఆయన కెరీర్ మొదలైంది. 2003 నుంచి 2014 వరకు ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ అధికార ప్రతినిధిగా సేవలు అందించారు. ఆయన 2014లో బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. దీంతో పార్టీలో జాతీయ కార్యదర్శి పదవి లభించింది. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయడంలో రామ్ మాధవ్ ముఖ్య పాత్ర పోషించారు. 2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలతో కూటమి ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు.
కిషన్ రెడ్డి సైతం..
తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా బీజేపీ చీఫ్ రేసులో ఉన్నారు. ఈయనను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జేపీ నడ్డాలతో ఉన్న సాన్నిహిత్యం కిషన్ రెడ్డికి కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. హిందీభాషపై పట్టు ఉండటం.. గతంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా సేవలందించిన అనుభవం ఆయనకు అడ్వాంటేజ్‌లుగా మారొచ్చు.