BJP chief : కొత్త ఏడాదిలో బీజేపీకి నూతన అధ్యక్షుడు..!
ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఉన్న విషయం తెలిసిందే. 2020లో ఆయన బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.
- Author : Latha Suma
Date : 17-12-2024 - 1:36 IST
Published By : Hashtagu Telugu Desk
BJP chief : మరికొన్ని నెలల్లో బీజేపీకి నూతన అధ్యక్షుడు రానున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను మొదలు పెట్టినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరికల్లా ఈ ఎంపిక ప్రక్రియ పూర్తి అవుతుందని పేర్కొన్నాయి. ఫిబ్రవరి చివరికి జేపీ నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఉన్న విషయం తెలిసిందే. 2020లో ఆయన బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.
జేపీ నడ్డా ప్రస్తుతం పార్టీ జాతీయ అధ్యక్షుడితోపాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగానూ వ్యవహరిస్తున్నారు. ఇక పార్టీ చీఫ్ పదవీకాలం మూడు సంవత్సరాలే. దీంతో ఇటీవలే ఆయన పదవీకాలం ముగిసింది. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగించారు. ఈ క్రమంలోనే తదుపరి పార్టీ అధ్యక్షుడు ఎవరన్న దానిపై జోరుగా చర్చ నడుస్తున్నది. కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్న వారిలోనే ఒకరికి జాతీయాధ్యక్షుడి బాధ్యతలు అప్పగిస్తారా..? లేక కొత్త వారిని తీసుకుంటారా..? అనే విషయంపై తీవ్రంగా చర్చ జరుగుతోంది.
అయితే రేసులో పలువురి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ తొలి మహిళా అధ్యక్షురాలిగా కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ నియమితులయ్యే అవకాశమున్నట్టు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే పేరు రేసులో ప్రధానంగా వినిస్తున్నది. బీఎల్ సంతోష్ తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీల్లో అత్యంత ప్రభావవంతమైన నేతగా తావ్డేకు పేరున్నది. అలాగే తెలంగాణకు చెందిన కే లక్ష్మణ్ కూడా రేసులో ఉన్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ ఓబీసీ మోర్చా చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉన్నది. రేసులో సునీల్ బన్సల్ పేరు కూడా వినిపిస్తున్నది. ఆయన తెలంగాణ, బెంగాల్, ఒడిశా రాష్ర్టాల ఇన్‌చార్జిగా ఉన్నారు. ఎంపీ ఓం మాథుర్ కూడా అధ్యక్ష రేసులో ఉన్నారు.
కాగా, పార్టీ రాజ్యాంగం ప్రకారం.. జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్న సంస్థాగత ఎన్నికలు సజావుగా సాగుతున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. సగానికి పైగా రాష్ట్ర యూనిట్లలో పోలింగ్ ప్రక్రియ జనవరి మధ్య నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Read Also: Woman delivers baby in Ambulance : అంబులెన్స్ లో ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం