Sunita Williams : అంతరిక్ష కేంద్రంలోనే సునీతా విలియమ్స్.. భూమికి తిరిగి వచ్చేదెప్పుడు ?
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ జూన్ 5వ తేదీ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోనే ఉన్నారు.
- By Pasha Published Date - 04:54 PM, Sat - 22 June 24

Sunita Williams : భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ జూన్ 5వ తేదీ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోనే ఉన్నారు. వ్యోమగామి బుచ్ విల్‌మోర్, సునీతా విలియమ్స్ కలిసి బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్‌లైనర్ వ్యోమనౌక ద్వారా ఐఎస్ఎస్‌కు చేరుకున్నారు. 10 రోజుల పాటు ఐఎస్ఎస్‌లో ఉండి.. అక్కడి నుంచి జూన్ 14న భూమికి వారిద్దరూ తిరిగి వస్తారని తొలుత ప్రకటించారు. అయితే స్టార్‌లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజీ సమస్య ఏర్పడింది. దీంతో భూమిపై వ్యోమనౌక ల్యాండింగ్‌ను వాయిదా వేశారు. జూన్ 26న సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం జరుగుతుందని నాసా ప్రకటించినప్పటికీ .. ఇప్పుడు మరోసారి ఆ తేదీని వాయిదా వేశారు. తదుపరిగా జులై 2న బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో సునీతా విలియమ్స్(Sunita Williams), బుచ్ విల్‌మోర్ కలిసి భూమికి చేరుకుంటారని నాసా అంచనా వేస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
- విమానాలను తయారు చేసే బోయింగ్ కంపెనీ తొలిసారిగా స్టార్‌లైనర్ పేరుతో స్పేస్ క్రాఫ్ట్‌ను తయారు చేసింది.
- తొలిసారిగా బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో ప్రయాణించిన ఆస్ట్రోనాట్‌గా సునీతా విలియమ్స్ రికార్డును సొంతం చేసుకున్నారు.
- సునీతా విలియమ్స్‌కు ఇది మూడో రోదసీ యాత్ర.
- గతంలో సునీతా విలియమ్స్ 2006, 2012 సంవత్సరాల్లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లి వచ్చారు. 50 గంటల 40 నిమిషాల పాటు ఆమె స్పేస్‌వాక్ చేశారు. 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు.
- ఐఎస్‌ఎస్‌లో ఓసారి సునీతా విలియమ్స్ మారథాన్ కూడా చేశారు.
- ఈసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లగానే ఆనందంతో సునీతా విలియమ్స్ డ్యాన్స్ చేశారు.