Soldier Firing : ఆరుగురు తోటి సైనికులపై జవాన్ కాల్పులు.. ఆ వెంటనే సూసైడ్
Soldier Firing : మణిపూర్‌లో మరో కలకలం రేగింది.
- By Pasha Published Date - 01:11 PM, Wed - 24 January 24

Soldier Firing : మణిపూర్‌లో మరో కలకలం రేగింది. బుధవారం ఉదయం మణిపూర్ దక్షిణ ప్రాంతంలోని తన బెటాలియన్‌లో అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఒక సైనికుడు తన తోటి ఆరుగురు సైనికులపై కాల్పులకు(Soldier Firing) తెగబడ్డాడు. అనంతరం తనను తాను కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు. మయన్మార్ బార్డర్‌లోని అస్సాం రైఫిల్స్ బెటాలియన్‌లో ఈ ఘటన జరిగింది. ఆరుగురు సైనికుల శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో వారిని హుటాహుటిన సమీపంలోని మిలిటరీ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని అస్సాం రైఫిల్స్ ఓ ప్రకటనలో తెలిపింది. “ఈ ఘటన వెనుక మణిపూర్‌లో జరుగుతున్న జాతి కలహాల అంశమేదీ లేదు. అలాంటి ఊహాగానాలను ఎవరూ పట్టించు కోవాల్సిన అవసరం లేదు. సంఘటన వివరాలను పారదర్శకంగా పంచుకోవడం చాలా ముఖ్యం. గాయపడిన వారిలో ఎవరూ మణిపూర్‌కు చెందినవారు లేరు. నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు ఘటనపై విచారణకు ఆదేశించాం’’ అని అస్సాం రైఫిల్స్ పేర్కొంది. “మణిపూర్‌లో ఉన్న అస్సాం రైఫిల్స్ బెటాలియన్లలో మణిపూర్‌కు చెందిన అన్ని వర్గాల వారు ఉన్నారు. మణిపూర్‌లో శాంతి, సుస్థిరతను కాపాడేందుకు బెటాలియన్లలోని సిబ్బంది అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు” అని వెల్లడించింది. ‘‘ఈ కాల్పులు జరిపిన సైనికుడు మణిపూర్‌లోని చురచంద్‌పూర్ ప్రాంతానికి చెందినవాడు. అతడు ఇటీవలే డ్యూటీలో చేరాడు. అతడు కాల్పులు జరిపిన ఆరుగురు సైనికులంతా మణిపూర్ వాసులు కాదు’’ అస్సాం రైఫిల్స్ స్పష్టం చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
మణిపూర్‌లో 25 కుకీ తిరుగుబాటు గ్రూప్‌లతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అఖిలపక్షం కోరింది. ఈమేరకు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అధ్యక్షతన గత సోమవారం జరిగిన సమావేశంలో డిమాండ్ చేసింది. ఒప్పందం రద్దయితే కుకీ తిరుగుబాటుదారులపై చర్యలు తీసుకునేందుకు వీలుపడుతుందని విపక్ష పార్టీలు అభిప్రాయపడ్డాయి. మరోవైపు ఆర్టికల్ 355ని అమలుచేస్తున్నట్లు రాష్ట్ర ప్రజలకు అటు కేంద్రం గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ వెల్లడించకపోవడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. గతేడాది మేలో కుకీ, మైతేయి తెగల మధ్య జరిగిన హింసతో మణిపూర్‌లో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఈ క్రమంలో శాంతిభద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 ప్రకారం.. అంతర్గత ఘర్షణలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనప్పుడు, విదేశీ దురాక్రమణల సమయంలో శాంతిభద్రతలను కాపాడేందుకు కేంద్రం నేరుగా చర్యలు తీసుకోవచ్చు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అక్కర్లేదు. అలాగని రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రపతి పాలనకు ముందు దశగా దీనిని చెబుతుంటారు.