Jammu and Kashmir : లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఐదుగురు జవాన్లు మృతి
వాహనంలో మొత్తం 18 మంది సైనికులు ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
- By Latha Suma Published Date - 08:37 PM, Tue - 24 December 24

Jammu and Kashmir : జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. జవాన్లతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మృతి చెందగా, 12 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఒక సైనికుడు ఎలాంటి గాయలు లేకుండా బయటపడ్డాడు. వాహనంలో మొత్తం 18 మంది సైనికులు ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జవాన్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. 300 అడుగుల లోతున్న లోయలో జవాన్ల వాహనం పడిపోయింది.
సైనిక సిబ్బంది వాహనంలో తమ పోస్ట్ వైపు వెళుతుండగా, మార్గమధ్యంలో వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం సంభవించింది. వాహనంలో మొత్తం 18 మంది సైనికులు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ సంఘటన మాన్‌కోట్ పోలీస్ స్టేషన్ , మెంధార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నియంత్రణ రేఖ సమీపంలో జరిగింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, సహాయక, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
కాగా, గత నెలలో రాజౌరి జిల్లాలో కాలాకోట్ సమీపంలోని బడ్గో గ్రామం వద్ద సైనికులు వెళ్తున్న వాహనం అదుపు తప్పి.. లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఒక సైనికుడు మరణించగా మరో సైనికుడు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన సైనికుడు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడని సైనిక ఉన్నతాధికారులు తెలిపారు. మరో ఘటనలో రైయిసీ జిల్లాలో కారు లోయలో పడి మహిళ, 10 ఏళ్ల బాలుడు మరణించారని ఆర్మీ అధికారులు తెలిపారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని సైనిక అధికారులు వివరించారు.