Gyanvapi Mosque : జ్ఞానవాపి కేసు.. మసీదు పిటిషన్ తిరస్కరణ.. ఆలయ పిటిషన్‌కు అనుమతి
Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
- Author : Pasha
Date : 19-12-2023 - 1:06 IST
Published By : Hashtagu Telugu Desk
Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. ‘‘జ్ఞానవాపి మసీదు.. జ్ఞానవాపి దేవాలయంలో భాగం. మసీదు స్థలంలోనూ ఆలయాన్ని పునరుద్ధరించాలి’’ అని కోరుతూ వారణాసి కోర్టులో 1991లో ఆది విశ్వేశ్వర్ విరాజ్‌మాన్ వేసిన దావాను సవాలు చేస్తూ జ్ఞానవాపి మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఆది విశ్వేశ్వర్ విరాజ్‌మాన్ వేసిన పిటిషన్‌పై ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని వారణాసి కోర్టును ఆదేశించింది. దేశంలోని కీలకమైన రెండు వర్గాల మనోభావాలతో ముడిపడిన ఈ అంశంపై త్వరగా విచారణను పూర్తి చేయాలని వారణాసి కోర్టుకు సూచించింది. ఇప్పటివరకు హైకోర్టులో జ్ఞానవాపి మసీదు కమిటీ మూడు పిటిషన్లు, ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు రెండు పిటిషన్లు వేశాయి. వీటిలో రెండు పిటిషన్లు.. 1991లో ఆది విశ్వేశ్వర్ విరాజ్‌మాన్ వేసిన దావాను సవాలు చేస్తూ దాఖలయ్యాయి. తాజాగా మంగళవారం వీటినే అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది.
We’re now on WhatsApp. Click to Join.
ఆది విశ్వేశ్వర్ విరాజ్‌మాన్ 1991లో వారణాసి కోర్టులో వేసిన పిటిషన్‌లో.. వివాదాస్పద ప్రాంగణాన్ని నియంత్రించాలని, అక్కడ పూజలకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే ప్రార్థనా స్థలాల చట్టం (ప్రత్యేక నిబంధనలు) ప్రకారం ఈ పిటిషన్ చెల్లదని జ్ఞానవాపి మసీదు కమిటీ, యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాదులు తమ వాదన వినిపించారు. 1947 ఆగస్టు 15 నాటికే దేశంలో ఉన్న మతపరమైన స్థలాల స్వభావాన్ని మార్చకుండా ప్రార్థనా స్థలాల చట్టం రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు. అయితే జ్ఞానవాపి మసీదుకు(Gyanvapi Mosque) సంబంధించిన వివాదం స్వాతంత్య్రానికి పూర్వం నుంచే ఉన్నందున.. అది ప్రార్థనా స్థలాల చట్టం పరిధిలోకి రాదని ఆది విశ్వేశ్వర్ విరాజ్‌మాన్ తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.