Jairam Ramesh : ప్రజల దృష్టి మరల్చడానికే అఖిలపక్ష ప్రతినిధి బృందాలు విదేశాలకు: జైరాం రమేశ్
ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ అనంతరం కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటూ, వాటిపై జవాబులు ఇవ్వాల్సిన ప్రశ్నలను తప్పించుకునేందుకు ఈ విదేశీ పర్యటనలు ఒక్కసారిగా అనుకున్నాయని ఆయన ఆరోపించారు.
- By Latha Suma Published Date - 11:49 AM, Wed - 21 May 25

Jairam Ramesh : ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష ప్రతినిధి బృందాలను విదేశాలకు పంపిస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్రంగా విమర్శించారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ అనంతరం కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటూ, వాటిపై జవాబులు ఇవ్వాల్సిన ప్రశ్నలను తప్పించుకునేందుకు ఈ విదేశీ పర్యటనలు ఒక్కసారిగా అనుకున్నాయని ఆయన ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ తీసుకున్న దృఢమైన విధానాన్ని, ముఖ్యంగా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై తీసుకున్న చర్యలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలతో కూడిన ఏడు అఖిలపక్ష బృందాలను ప్రపంచంలోని వివిధ దేశాలకు పంపాలని నిర్ణయించింది. ఈ బృందాలు ఆయా దేశాల ప్రభుత్వాధినేతలు, పార్లమెంటేరియన్లు, మేధావులు, మీడియా సభ్యులతో సమావేశమవుతాయని కేంద్రం వెల్లడించింది.
Read Also: YogaAndhra-2025 : యోగాంధ్ర..రెండు కోట్ల మందితో యోగా డే : సీఎం చంద్రబాబు
జైరాం రమేశ్ ఈ నేపథ్యంలో మాట్లాడుతూ.. “1950 నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్-నవంబర్‌లో ఐక్యరాజ్యసమితిలో భారత స్థానం ప్రదర్శించేందుకు అఖిలపక్ష ప్రతినిధులను పంపటం ఒక సంప్రదాయంగా కొనసాగింది. కానీ 2014 తర్వాత ఆ ప్రాథమిక సంప్రదాయాన్ని మోడీ ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు మాత్రం ప్రపంచవ్యాప్తంగా మోడీ ఇమేజ్ దెబ్బతినడంతో దీనికి నష్టనివారణ చర్యలుగా ఈ పర్యటనలు ఏర్పాటు చేశారు. అసలు సమస్యలపై జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్న సందర్భంలో దృష్టి మరల్చేందుకే ఎంపీలు విదేశాలకు పంపుతున్నారు” అని ఆరోపించారు. ఇక, బృందాల్లోని సభ్యుల ఎంపికపై కూడా తీవ్ర రాజకీయ వివాదం చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ, ప్రతినిధి బృందాల్లో సభ్యుల ఎంపికను పార్టీలకే వదిలించాల్సిందని అభిప్రాయపడుతోంది. కానీ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాత్రం ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని, ఏ పార్టీకి ఎంపికకు అవకాశం ఇవ్వలేదని స్పష్టం చేశారు. దీనిపై జైరాం రమేశ్ కాఠిన్యంగా స్పందిస్తూ, రిజిజు వ్యాఖ్యలు సత్యదూరమని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ నుండి సిఫార్సు చేసిన ఆనంద్ శర్మ, గౌరవ్ గొగొయ్, సయ్యద్ నసీర్ హుసేన్, అమరీందర్ సింగ్‌లలో కేవలం ఆనంద్ శర్మకే బృందంలో స్థానం లభించింది. మరోవైపు కాంగ్రెస్ సూచించని శశి థరూర్, మనీష్ తివారీ, అమర్ సింగ్, సల్మాన్ ఖుర్షీద్‌లను ప్రభుత్వం బృందాల్లో చేర్చింది. ఇదే అంశంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అఖిలపక్ష బృందాల పేరుతో కేంద్రం తీసుకుంటున్న ఈ చర్యలు ప్రజలను మోసం చేయడమేనని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది.