Aadhaar Service Charges : అక్టోబర్ 1 నుంచి ఆధార్ ఛార్జీలు పెంపు
Aadhaar Service Charges : ఆధార్ సర్వీస్ ఛార్జీల పెంపు సాధారణ ప్రజలకు కొంత భారం పెంచినా, సేవల నాణ్యత, సాంకేతిక వసతుల విస్తరణకు ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నారు
- By Sudheer Published Date - 08:00 AM, Wed - 24 September 25

దేశంలో కోట్లాది మంది ఆధారపడే ఆధార్ సేవల ఛార్జీల్లో పెంపు జరగబోతోందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రకటించింది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చే ఈ కొత్త రేట్ల ప్రకారం..ఆధార్‌లో తప్పుల సవరణ లేదా వివరాల అప్డేట్ కోసం ఇప్పటి వరకు వసూలు చేస్తున్న రూ.50ను రూ.75కు పెంచారు. ఇదే విధంగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలంటే ఇకపై రూ.100 కాకుండా రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పులు దేశవ్యాప్తంగా అన్ని ఆధార్ కేంద్రాల్లో ఒకేసారి అమల్లోకి రానున్నాయి.
Aadhar: ఆధార్‌లో భారీ మార్పులు త్వరలో – ఫేస్ అథెంటికేషన్, కొత్త యాప్ రాబోతున్నాయి!
పోర్టల్ ద్వారా నేరుగా అందించే సేవలపైనా ఛార్జీలు పెంచినట్లు UIDAI వెల్లడించింది. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో సవరణలు లేదా అప్డేట్ కోసం రూ.50 మాత్రమే వసూలు చేస్తుండగా, ఇకపై అది రూ.75గా ఉండనుంది. అదేవిధంగా పోయిన ఆధార్ స్థానంలో కొత్త కార్డు పొందడానికి రూ.40 అప్లికేషన్ ఫీజు చెల్లించాలని పేర్కొంది. ఆధార్ కార్డును గుర్తింపు పత్రంగా విస్తృతంగా ఉపయోగిస్తున్నందున, ఈ సేవలపై డిమాండ్ ఎప్పటికీ కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆధార్ సర్వీస్ ఛార్జీల పెంపు సాధారణ ప్రజలకు కొంత భారం పెంచినా, సేవల నాణ్యత, సాంకేతిక వసతుల విస్తరణకు ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆధార్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, భద్రతా ప్రమాణాలను పెంచడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. అయితే పేద, మధ్యతరగతి వర్గాలపై ఈ పెంపు ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉండటంతో, ప్రభుత్వం ఈ విభాగానికి సబ్సిడీ లేదా ప్రత్యేక రాయితీలు కల్పించాలని ప్రజలు ఆశిస్తున్నారు.