Myanmar – Mizoram : మరోసారి మిజోరంలోకి మయన్మార్ సైనికులు.. ఎందుకు ?
Myanmar - Mizoram : భారత్ పొరుగుదేశం మయన్మార్‌లో అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరింది.
- Author : Pasha
Date : 31-12-2023 - 7:35 IST
Published By : Hashtagu Telugu Desk
Myanmar – Mizoram : భారత్ పొరుగుదేశం మయన్మార్‌లో అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరింది. అక్కడ ప్రజాసంఘాలు ఏర్పాటుచేసిన తిరుగుబాటు గ్రూపులు, సైన్యానికి మధ్య గత కొన్ని నెలలుగా భీకర పోరు జరుగుతోంది. ఈ పోరులో క్రమంగా మయన్మార్ ప్రజా తిరుగుబాటు గ్రూపులే పైచేయి సాధిస్తున్నాయి. ఇప్పటికే యమన్మార్ – చైనా బార్డర్ గేట్ ఏరియాను తిరుగుబాటు గ్రూపులు అదుపులోకి తీసుకున్నాయి. భారత్‌లోని మిజోరం రాష్ట్రం శివార్లలో ఉండే మయన్మార్ బార్డర్ వద్ద గత కొన్ని నెలలుగా జరుగుతున్న పోరులో ప్రజా తిరుగుబాటు గ్రూపులు కీలక పురోగతి సాధించాయి. మయన్మార్ ఆర్మీ స్థావరాలను అరకాన్ ఆర్మీ అనే ప్రజా తిరుగుబాటు గ్రూపు స్వాధీనం చేసుకుంది. దీంతో వాటిలో ఉండే దాదాపు 151 మందికిపైగా మయన్మార్ సైనికులు ప్రాణాలను కాపాడుకునేందుకు ఇండియా బార్డర్‌లోకి ప్రవేశించారు. వీరంతా సరిహద్దు మార్గం ద్వారా మిజోరంలోని లాంగ్ట్లై జిల్లాలోని టుయిసెంట్‌లాంగ్ ప్రాంతంలోకి ఎంటర్ అయ్యారని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈవిషయాన్ని అస్సాం రైఫిల్స్ అధికారులు కూడా ధ్రువీకరించారు. శుక్రవారం రోజు ఇండియాలోకి వచ్చిన వారంతా ‘టాట్‌మదావ్’ అనే మయన్మార్ ఆర్మీ బెటాలియన్‌కు చెందినవారని(Myanmar Soldiers In Mizoram) చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
మయన్మార్ ఆర్మీ సిబ్బందిలో కొంతమందికి తీవ్ర గాయాలై ఉండటంతో అస్సాం రైఫిల్స్ సిబ్బంది వారికి ప్రథమ చికిత్స అందించారని అస్సాం రైఫిల్స్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దీనిపై భారత విదేశాంగ శాఖ, మయన్మార్ మిలిటరీ ప్రభుత్వం మధ్య చర్చలు జరుగుతున్నాయని.. మయన్మార్ సైనికులను కొన్ని రోజుల్లో వారి దేశానికి తిరిగి పంపిస్తామని వెల్లడించారు. ఈ ఏడాది నవంబర్‌లోనూ ఇదేవిధంగా దాదాపు 104 మంది మయన్మార్ సైనికులు మిజోరంలోకి చొరబడ్డారు. అనంతరం వారిని భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో మణిపూర్‌లోని మోరేకు తరలించింది. అక్కడి నుంచి వారు అంతర్జాతీయ సరిహద్దును దాటి మయన్మార్‌లోని సమీప సరిహద్దు పట్టణమైన టములోకి ప్రవేశించారు.