Urinary tract infection : మూత్రనాళాల ఇన్ ఫెక్షన్‌కు పెరుగుతో చెక్.. ఎలాగో తెలుసుకోండిలా?
Urinary tract infection : శరీరంలో మూత్రాశయం, కిడ్నీలు, మూత్రనాళాలు, మూత్రమార్గం వంటి వాటిలో ఏదైనా భాగంలో ఇన్ఫెక్షన్ సోకితే దానిని మూత్రనాళాల ఇన్ఫెక్షన్ లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) అని అంటారు.
- By Kavya Krishna Published Date - 06:30 PM, Wed - 20 August 25

Urinary tract infection : శరీరంలో మూత్రాశయం, కిడ్నీలు, మూత్రనాళాలు, మూత్రమార్గం వంటి వాటిలో ఏదైనా భాగంలో ఇన్ఫెక్షన్ సోకితే దానిని మూత్రనాళాల ఇన్ఫెక్షన్ లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) అని అంటారు. ఇవి చాలా సాధారణమైన ఆరోగ్య సమస్యలు, ఇవి పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. దీనికి ప్రధాన కారణం మహిళల మూత్రమార్గం పురుషుల కంటే చిన్నదిగా ఉండటం వల్ల బ్యాక్టీరియా సులభంగా లోపలికి ప్రవేశించగలదు. ఫలితంగా మహిళలు ఎక్కువగా యూరిన్ ఇన్ ఫెక్షన్ తో బాధపడుతుంటారు.
UTI ఎలా వస్తుంది?
ఈ ఇన్ఫెక్షన్ సాధారణంగా ఎస్చెరిచియా కోలి (E. coli) అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా సాధారణంగా మన పెద్ద ప్రేగులలో ఉంటుంది. మరుగుదొడ్డిని ఉపయోగించిన తరువాత శుభ్రంగా కడుక్కోకపోవడం, తక్కువ నీరు తాగడం, మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం వంటివి ఈ బ్యాక్టీరియా మూత్రమార్గం ద్వారా మూత్రాశయంలోకి ప్రవేశించడానికి కారణమవుతాయి. అక్కడ బ్యాక్టీరియా వృద్ధి చెంది ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. ఇన్ఫెక్షన్ మూత్రాశయం నుంచి కిడ్నీలకు కూడా వ్యాపిస్తే మరింత తీవ్రమైన సమస్యలకు కారణం కావచ్చు. అందుకే యూరిన్, మలవిసర్జన తర్వాత శుభ్రంగా వాష్ అనేది చేసుకోవాలి. లేనియెడల బ్యాక్టీరియా సోకే ప్రమాదం ఉంటుంది.
పెరుగు వల్ల ఉపయోగం ఉందా?
పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి మన ప్రేగులలో ఉండే మంచి బ్యాక్టీరియా లాంటివి. ఈ ప్రోబయోటిక్స్ శరీరం రోగనిరోధక శక్తిని పెంచి, చెడు బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా, యోగర్ట్ లేదా పెరుగులో ఉండే లాక్టోబాసిల్లస్ వంటి బ్యాక్టీరియాలు మూత్రాశయంలోని హానికరమైన బ్యాక్టీరియాను అడ్డుకుంటాయి. కాబట్టి పెరుగు తినడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గడానికి పరోక్షంగా సహాయపడుతుంది కానీ, అది పూర్తి చికిత్స కాదు. మూత్రంలో మంట వంటివి దీనికి సంకేతాలు అనేవి గుర్తుంచుకోవాలి.
ఇన్ ఫెక్షన్ సోకడానికి అనేక కారణాలు
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) రావడానికి పలు కారణాలు ఉన్నాయి. తక్కువ నీరు తాగడం వల్ల బ్యాక్టీరియా మూత్రాశయం నుంచి బయటకు వెళ్లిపోదు. ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకోవడం వల్ల బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మధుమేహం వంటి వ్యాధులు, మూత్రపిండాల్లో రాళ్ళు, బలహీనమైన రోగనిరోధక శక్తి కూడా ఇన్ఫెక్షన్‌కు కారణమవుతాయి. లైంగిక కార్యకలాపాలు కూడా బ్యాక్టీరియా ప్రవేశించడానికి ఒక కారణంగా చెప్పవచ్చు.అందుకే మహిళలు త్వరగా బ్యాక్టీరియా ప్రమాదం బారిన పడతారు.అందుకే శుభ్రతను పాటించడం చాలా అవసరం.
మూత్రనాళాల ఇన్ఫెక్షన్ అనేది సరైన జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చు. ఎక్కువగా నీరు తాగడం, పరిశుభ్రత పాటించడం, మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోకుండా ఉండటం వంటివి చాలా ముఖ్యం. పెరుగు తినడం వల్ల మంచి బ్యాక్టీరియా పెరిగి, ఇన్ఫెక్షన్‌కు నిరోధక శక్తి లభిస్తుంది కానీ, ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటే, డాక్టర్ సలహా తీసుకోవడం, యాంటీబయోటిక్స్ వాడటం అవసరం. కేవలం పెరుగు మీద ఆధారపడితే సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అందుకే, సమస్య ఉన్నప్పుడు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.