Summer Tips: వేసవిలో ఈ 6 రకాల డ్రింక్స్ తాగితే చాలు.. భగభగ మండే ఎండలు సైతం మిమ్మల్ని ఏమి చేయలేవు!
వేసవికాలంలో ఇప్పుడు చెప్పబోయే ఆరు రకాల డ్రింక్స్ తీసుకుంటే ఎలాంటి సమస్యలు రావు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
- By Anshu Published Date - 04:01 PM, Sun - 9 February 25

మామూలుగా మార్చి నెల ఆఖరి నుంచి ఏప్రిల్ మే జూన్ వరకు ఎండలు విపరీతంగా కాస్తూ ఉంటాయి. దాదాపు 3 నెలల పాటు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడు. కానీ ఇప్పుడు మాత్రం ఇంకా ఫిబ్రవరి నెల కూడా ముగియకముందే అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి నెల ముగియకముందే ఇలా ఉన్నాయి అంటే ముందు ముందు సూర్య తాపం ఇంకా ఎలా ఉండబోతుందో అని తలుచుకుంటేనే భయపడుతున్నారు ప్రజలు. ఈ ఎండాకాలంలో మన చర్మంతో పాటు ఆరోగ్యానికి కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. వేసవికాలంలో వేడి డిహైడ్రేషన్ వంటి సమస్యల బారిన పడకుండా శరీరాన్ని కాపాడుకోవాలి. ఈ క్రమంలో కొన్ని రకాల డ్రింక్స్ లేదా పానీయాలు వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఈ పానీయాలు మన దాహాన్ని తీర్చడం మాత్రమే కాకుండా శరీరంలోని వేడిని నియంత్రించి మనల్ని చల్లబరుస్తాయట. ఇంకా ఎండా కాలంలో శరీరానికి కావలసిన పోషకాలను కూడా అందించగులుగుతాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ డ్రింక్స్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వేసవి కాలం వచ్చిందంటే రోడ్డు పక్కన ఎక్కడ చూసినా కూడా చెరుకు రసం దుకాణాలు కనిపిస్తుంటాయి. అల్లం కాస్త నిమ్మ పండు వేసి పుదీనా వేసి చెరుకు రసాన్ని సర్వ్ చేస్తూ ఉంటారు. ఈ పానీయం సహజ తీపి రుచిని కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ డ్రింక్ మనల్ని వేసవి ఎండల నుంచి కాపాడగలుగుతుందని చెబుతున్నారు. అయితే చెరుకు రసం తాగడం మంచిదే కానీ ఇందులో ఐస్ కలపకుండా తాగితే ఇంకా మంచి ప్రయోజనాలు కలుగుతాయట.
వేసవి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మజ్జిగ.. ఎక్కువ శాతం మంది ఈ వేసవికాలంలో మజ్జిగనే తాగుతూ ఉంటారు. లేదంటే పెరుగన్నం అలా తింటూ ఉంటారు. మజ్జిగ శరీరాన్ని చల్లబరచడంతో పాటు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.. మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. వేసవికాలంలో వీలైనంతవరకు గ్లాస్ మజ్జిగ తాగడం వల్ల ఎలాంటి సమస్యలు రావని చెబుతున్నారు.
వేసవిలో రోడ్డు పక్కన ఉన్న స్టాల్స్ లో ఏర్పాటు చేసే మరో ముఖ్యమైన స్టాల్ పుచ్చకాయ బండ్లు. పుచ్చకాయను జ్యూస్ రూపంలో కంటే ఎక్కువగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అమ్ముతూ ఉంటారు. ఈ పుచ్చకాయ జ్యూస్ మన దాహం తీర్చడమే కాకుండా శరీరానికి కావలసిన అనేక పోషకాలను అందిస్తుందని చెబుతున్నారు..
అలాగే వేసవికాలంలో మెంతి టీ మన శరీరానికి చాలా చల్లదనాన్ని ఇవ్వడమే కాక శరీరం నుంచి విషాన్ని బయటకు పంపుతుందట. గ్యాస్, స్టమక్ యాసిడ్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో చక్కెరను కూడా నియంత్రిస్తుందట. అలాగే ఈ మెంతి టీ పాలిచ్చే తల్లులలో పాల ఉత్పత్తిని పెంచుతుందట.
ఆహారంలో ఉపయోగించే జీలకర్ర మన అంతర్గత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందట. అందుకోసం కాచి చల్లారిన నీటిలో కాస్త నానబెట్టిన జీలకర్ర నీరు లేదా రెండు చిటికెల జీలకర్ర వేసి మరిగించి ఆ నీరు త్రాగవచ్చని చెబుతున్నారు. ఇది మన శరీరానికి చాలా చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు జీర్ణ సమస్యలను పరిష్కరిస్తుందట.
ఇకపోతే వేసవి కాలంలో తప్పనిసరిగా తీసుకోవలసిన డ్రింక్ ఏమైనా ఉంది అంటే అది కొబ్బరి నీరే. దీనిలోని పోషకాలు మన శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. వేసవి కాలంలో ఉదయాన్నే కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరం రోజంతా చల్లగా ఉంటుంది. మధ్యాహ్న సమయంలో కొబ్బరినీరు తాగితే శరీరానికి ఉల్లాసం లభిస్తుందట. కాబట్టి ఎక్కువ రేట్లు పెట్టి కూల్డ్రింక్స్ తాగడం కంటే ఒక కొబ్బరి బొండం తాగడం మంచిదని చెబుతున్నారు.