Super Vision : కళ్లు మూసుకున్నా చూడొచ్చు.. చీకట్లోనూ చూడొచ్చు.. చైనా కాంటాక్ట్ లెన్స్ మహిమ
కళ్లద్దాలు ధరించొద్దని భావించే వారు కాంటాక్ట్ లెన్సులను(Super Vision) వాడుతుంటారు.
- By Pasha Published Date - 01:46 PM, Mon - 26 May 25

Super Vision : చైనా సైంటిస్టులా మజాకా. సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా దేశాల సైంటిస్టులకు తామేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. అధునాతన టెక్నాలజీని చైనా సైంటిస్టులు కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. మనం ఊహించలేని ఆవిష్కరణలతో అబ్బుర పరుస్తున్నారు. తాజాగా కళ్లు మూసుకొని కూడా చూడగలిగే సూపర్ విజన్ ఇన్‌ఫ్రారెడ్ కాంటాక్ట్ లెన్స్‌లను చైనా శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఈ లెన్స్‌ను మనం పెట్టుకుంటే చిమ్మ చీకట్లోనూ అన్నీ క్లియర్‌గా కనిపిస్తాయట. చైనాలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన న్యూరో సైంటిస్టులు ఈ ఆవిష్కరణ చేశారు. దీనికి సంబంధించిన వివరాలతో ఒక అధ్యయన నివేదిక ‘సెల్ జర్నల్’లో పబ్లిష్ అయింది.
Also Read :Southwest Monsoon : తెలంగాణ, ఏపీలను తాకిన ‘నైరుతి’.. రాబోయే 3 రోజులు వానలు
సూపర్ విజన్ ఇన్‌ఫ్రారెడ్ కాంటాక్ట్ లెన్స్ గురించి..
- కళ్లద్దాలు ధరించొద్దని భావించే వారు కాంటాక్ట్ లెన్సులను(Super Vision) వాడుతుంటారు. అత్యంత పలుచగా ఉండే కాంటాక్ట్ లెన్సు పొరలను తమ కళ్లలో పెట్టుకుంటారు.
- చాలా దశాబ్దాలుగా ప్రపంచ దేశాల ప్రజలు కాంటాక్ట్ లెన్సులను వాడుతున్నారు.
- సాధారణ తరహా కాంటాక్ట్ లెన్సులలో పాలిమర్‌లు ఉంటాయి. ఈ పాలిమర్‌లను నానోపార్టికల్స్‌తో కలపడం ద్వారా చిమ్మ చీకట్లోనూ అన్నీ క్లియర్‌గా కనిపించేలా సరికొత్త కాంటాక్ట్ లెన్సులను చైనా సైంటిస్టులు తయారు చేశారు.
- ఈ సరికొత్త లెన్స్‌లకు సాధారణ నైట్ విజన్ గాగుల్స్‌లాగా విద్యుత్ అవసరం లేదని శాస్త్రవేత్తలు ప్రకటించారు.
- ఈ సూపర్ విజన్ ఇన్‌ఫ్రారెడ్ కాంటాక్ట్ లెన్స్‌లు పారదర్శకంగా ఉంటాయి. వివిధ ఇన్‌ఫ్రారెడ్ ఫ్రీకెన్సీలను గ్రహించే సామర్థ్యం వీటికి ఉంటుంది. అందువల్లే ఇవి ధరించిన వారు.. కళ్లు మూసుకున్నా అన్నీ కనిపిస్తాయి.
- ఈ కాంటాక్ట్ లెన్స్‌లో ఉపయోగించే నానోపార్టికల్స్ ఇన్‌ఫ్రారెడ్ కాంతిని గ్రహించి, వాటిని మన కళ్లకు కనిపించే ఫ్రీక్వెన్సీలోకి మార్చేస్తాయి. ఈ ప్రక్రియ వల్లే చీకట్లో, కళ్లు మూసుకున్నప్పుడు కూడా ఎదుట ఉన్న సీన్‌లు మనకు స్పష్టంగా కనిపిస్తాయి.
- మొత్తం మీద ఈ లెన్సును ధరించే వారికి ఇన్‌ఫ్రారెడ్ కాంతి, దృశ్య కాంతి రెండూ ఏకకాలంలో కనిపిస్తాయి. కళ్ళు మూసుకున్నప్పుడు ఇన్‌ఫ్రారెడ్ ఫ్రీక్వెన్సీతో కూడిన సీన్ మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
- ఈ లెన్సులతో సైంటిస్టులు తొలుత ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించారు. తదుపరిగా మనుషులపై ట్రయల్స్ చేశారు. ఈ లెన్స్ వల్ల మనుషులు కళ్లు మూసుకున్నప్పుడు, వారి దృష్టి సామర్థ్యం బాగా పెరిగిందని పరిశోధనలో తేలింది.
- భవిష్యత్తులో ఈ సూపర్ విజన్ లెన్స్ దృష్టి లోపాలున్న వారికి అపూర్వమైన కానుకగా ఉపయోగపడుతుందని సైంటిస్టులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.