Health: ఆకలి లేదా ? ఇవే 5 కారణాలు.. ఆకలి పెరగాలా ? ఇవే 5 చిట్కాలు!!
- By Anshu Published Date - 07:00 PM, Sun - 18 December 22

Health: ఆహారం మన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. ఇది మనం ఆరోగ్యంగా ఉండటానికి , రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి చాలా అవసరం. తాత్కాలికంగా ఆకలి లేకపోవడం అనేది చాలా కారణాల వల్ల జరుగుతుంటుంది.
శరీరంలో మనం గుర్తించకుండా వదిలేసిన ఆరోగ్య సమస్యల వల్ల కూడా తక్కువ ఆకలి ఉండవచ్చు. మీ శరీరానికి ఆహారం అవసరమైనప్పుడు కూడా మీకు చాలా ఆకలిగా అనిపించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి కొందరు ఆకలి లేమితో బాధపడుతుంటారు. తినే టైం అయినా ఏమీ తినబుద్ధి కాక ఫుడ్ కు దూరమైపోతారు. ఇందుకు 5 ప్రధాన కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆకలి లేమి సమస్యకు చెక్ పెట్టే కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం..
* ఆకలి లేమికి 5 కారణాలివీ..
1.ఒత్తిడి
ఒత్తిడితో కూడిన సంఘటనల సమయంలో, కేంద్ర నాడీ వ్యవస్థ జీర్ణక్రియను మందగించే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ పరిణామం ఆకలిని ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక ఆందోళన , నిరాశతో బాధపడుతున్న వ్యక్తులు దీర్ఘకాలిక వికారంతో కూడిన ఫీలింగ్ ను ఎదుర్కొంటారు. ఇది అన్నం తినాలనే వారి కోరికను అణిచివేస్తుంది.
2.అంటువ్యాధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు
జలుబు, ఫ్లూ, దగ్గు లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు ఆకలిని కూడా ప్రభావితం చేస్తాయి.శ్వాసకోశ సమస్యలు, సైనస్, ముక్కులో చెడు వాసన అనేవి కూడా నోటి రుచికి అంతరాయం కలిగిస్తాయి. ఫలితంగా ఆకలి తగ్గిపోతుంది. ఆర్థరైటిస్ లేదా ఫైబ్రోమైయాల్జియా కారణంగా కీళ్ల లేదా కండరాల నొప్పి వల్ల మానసిక ఆరోగ్యం ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. దీనివల్ల కూడా ఆకలి తగ్గిపోతుంది. ప్రేగు సిండ్రోమ్, హైపోథైరాయిడిజం, పోషకాహార లోపాలు (జింక్ లోపం), హెపటైటిస్, హెచ్‌ఐవి, మూత్రపిండాలు,కాలేయ వ్యాధులు కొన్ని క్యాన్సర్‌లు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల వల్ల సైతం ఆకలి తగ్గుతుంది.
3.మందులు
యాంటీ బయాటిక్స్, యాంటీ హైపెర్టెన్సివ్స్, డైయూరిటిక్స్, మత్తుమందుల వినియోగం వల్ల ఆకలి తగ్గుతుంది. రేడియోథెరపీ, కీమోథెరపీ, పెరిటోనియల్ డయాలసిస్ వంటి చికిత్సలు చేయించుకున్న తర్వాత కూడా కొందరికి ఆకలి తగ్గుతుంది.
4.వయస్సు
ఆకలి తగ్గడానికి వయస్సు ఒక కారకం. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ జీవక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల హార్మోన్ పనితీరు తగ్గుతుంది. వయసుతో పాటు ఆహారాన్ని నమిలే సామర్థ్యం తగ్గుతుంది. పర్యవసానంగా ఆకలి కూడా తగ్గుతుంది.
5.గర్భం
గర్భధారణ సమయంలో మహిళలు అనేక హార్మోన్ల మార్పులకు లోనవుతారు. దీనివల్ల ఆకలి తగ్గుతుంది. గర్భధారణ సమయంలో మార్నింగ్ సిక్‌నెస్, వికారం, గుండెల్లో మంటలు వస్తాయి. ఫలితంగా ఆకలి డౌన్ అవుతుంది.
* ఆకలిని పెంచే 5 మార్గాలు
1.ఒంటరిగా తినడం మానుకోండి
ఒంటరిగా తినడానికి బదులుగా, ఆకలిని ప్రేరేపించడానికి కుటుంబం, స్నేహితులతో కలిసి భోజనం చేయండి. ఈ అలవాటు వైవిధ్యమైన, రుచికరమైన భోజనం తినాలనే కోరికను పెంచుతుంది.
2.పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోండి
ఎక్కువగా తినడానికి ఇబ్బంది పడే వ్యక్తులు అవోకాడో సలాడ్ లేదా స్మూతీ, చిలగడదుంప చాట్ తింటే బెటర్. పీచుపదార్థం ఉన్న ఆహారం ఆకలిని తగ్గిస్తుంది. ఎందుకంటే పీచు ఒక వ్యక్తిని ఎక్కువసేపు కడుపు నిండుగా భావించేలా చేస్తుంది. అందుకే ఇతర పోషకాలు ఉండే ఫుడ్ తింటే బెటర్.
3.చిన్న భోజనం తీసుకోండి : చిన్న, ఆరోగ్యకరమైన భోజనం తరచుగా తీసుకోండి. చిన్న సైజు మీల్స్ ను క్రమంగా పెంచుకుంటూ పోండి. దీనివల్ల క్రమంగా మీ ఆకలి పెరుగుతుంది.
4. రిమైండర్‌లను సెట్ చేయండి
ఒత్తిడి, డిప్రెషన్ లేదా ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తులు తమ ప్రాథమిక ఆరోగ్య అవసరాలను కోల్పోయే అవకాశం ఉన్నందున తినడానికి రిమైండర్‌లను సెట్ చేయవచ్చు. టైం కు భోజనం చేయండి.
5.బాగా నిద్రపోండి
శరీరం యొక్క సిర్కాడియన్ రిథమ్ ఆకలిని నియంత్రిస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన నిద్ర విధానాన్ని సెట్ చేసుకోండి. నిద్ర సరిగా లేని వ్యక్తులు క్రమరహితమైన మరియు అసాధారణమైన ఆకలి బాధలను అనుభవిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి.