Summer: వేసవిలో సాధారణంగా వచ్చే సమస్యలు ఇవే.. జాగ్రత్తగా ఏం చేయాలో తెలుసా?
వేసవికాలంలో వచ్చే చాలా రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి అని చెబుతున్నారు. ఆ విషయాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 11:03 AM, Thu - 3 April 25

ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో అయితే భానుడి భగభగలకు ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు. దాదాపు రెండు నెలల పాటు ఈ ఎండలు కొనసాగనున్నాయి. అయితే సమ్మర్ లో చాలామంది తమ ఫ్యామిలీతో కలిసి విహారయాత్రలకు ఫ్లాన్ చేసుకుంటుంటారు. కానీ ఈ వేసవి తనతో పాటు కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా తెస్తుంది. కాబట్టి మీరు ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించడం తప్పనిసరి. విపరీతమైన ఎండ కారణంగా కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. డీహైడ్రేషన్ నుండి ఫుడ్ పాయిజన్ వరకు అనేక సమస్యలు వస్తాయి. ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ సీజన్ ని కూడా ఆస్వాదించవచ్చట.
డీహైడ్రేషన్.. సమ్మర్ మెదలవగానే ఈ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. శరీరంలో తగినంత నీరు లేకపోవడాన్ని డీహైడ్రేషన్ అంటారు. వేడి వాతావరణం కారణంగా శరీరం ఎక్కువగా చెమట పడుతుంది. దీంతో నీరు, ముఖ్యమైన మినరల్స్ ని శరీరం కోల్పోతుందట. ఈ ద్రవాలను తిరిగి భర్తీ చేయకపోతే డీహైడ్రేషన్ సమస్య వస్తుందని చెబుతున్నారు. తలతిరగడం, తలనొప్పి, అలసట, చర్మం పొడిబారడం వంటి సమస్యలు వస్తాయట. దాహం వేయకపోయినా కూడా రోజంతా తగినంత నీరు తాగాలి. పుచ్చకాయ, దోసకాయ, నారింజ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.
అలాగే కెఫిన్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని చెబుతున్నారు. ఎండాకాలంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా వాటర్ బాటిల్ వెంట తప్పనిసరిగా తీసుకెళ్లాలి. హీట్ స్ట్రోక్ ఎక్కువసేపు అధిక ఉష్ణోగ్రతలకు గురికావడం వల్ల హీట్ ఎగ్జాషన్ వస్తుంది. దీంతో తలతిరగడం, వికారం, అధిక చెమట పట్టడం వంటి సమస్యలు వస్తాయట. అలాగే ఎక్కువసేపు ఎండలో ఉండడం వల్ల వడదెబ్బ తగిలే సమస్య కూడా ఎక్కువగా ఉంటుందట. వీలైతే మధ్యాహ్నం 12 నుండి 4 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడం మంచిది. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా కూడా టోపీ, సన్ గ్లాసెస్, గొడుగు వంటివి వెంట తీసుకెళ్లాలి. విపరీతమైన వేడిలో బాగా వెంటిలేషన్ ఉన్న లేదా ఎయిర్ కండిషన్డ్ ప్రదేశాల్లో ఉండాలి.
ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే కొబ్బరి నీరు వంటి ద్రవాలు తీసుకోవడం వల్ల శరీరానికి కోల్పోయిన ఖనిజాలు తిరిగి అందుతాయట. అలాగే ఎక్కువ సమయం సూర్య రశ్మికి గురికావడం, అధిక చెమట వల్ల చర్మంపై దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందట. అలాగే వేడి కారణంగా చెమట గ్రంథులు మూసుకుపోవడం వల్ల హీట్ రాష్ వస్తుందట. సూర్యరశ్మి వల్ల చర్మం కూడా దెబ్బతింటుందని చెబుతున్నారు. చెమట పేరుకుపోకుండా ఉండటానికి తేలికైన, కాటన్ దుస్తులు ధరించాలట. చల్లటి నీటితో స్నానం చేయడం, చర్మాన్ని పొడిగా ఉంచుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చని చెబుతున్నారు. సన్‌బర్న్ అయినట్లయితే కలబంద జెల్ లేదా మాయిశ్చరైజర్ ఉపయోగించవచ్చట. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు డీహైడ్రేషన్, అధిక చెమట వల్ల మూత్రం తక్కువగా ఉత్పత్తి అవుతుందట. దీంతో మూత్ర నాళంలో బ్యాక్టీరియా సాంద్రత పెరుగుతుంది. ఇది UTIలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందట. ఎక్కువ ద్రవాలు తీసుకోవడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయట.