Health Benefits of Coneflower: శంకపుష్ప మొక్క ఉపయోగాలు..!
శంకపుష్ప మొక్క ప్రకృతి మనకు ప్రసాదించిన ఔషధ మొక్క. ఆయుర్వేదంలో శంకపుష్ప మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. వీటి పువ్వులు, ఆకులు, కాండము, గింజలు మరియు వేళ్ళు అన్నీ అనేక ఔషద విలువలను కలిగి ఉన్నాయి.
- By Maheswara Rao Nadella Published Date - 05:45 AM, Tue - 29 November 22

శంకపుష్ప మొక్క ప్రకృతి మనకు ప్రసాదించిన ఔషధ మొక్క. ఆయుర్వేదంలో శంకపుష్ప మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. వీటి పువ్వులు, ఆకులు, కాండము, గింజలు మరియు వేళ్ళు అన్నీ అనేక ఔషద విలువలను కలిగి ఉన్నాయి. సంస్కృతంలో గిరికర్ణిక అని, హిందీలో అపరి౦జిత అని పిలుస్తారు. పురుషులకు శంకపుష్పాన్ని ఒక గొప్ప వరంగా చెప్పవచ్చు. ఇది పురుషులలో సంతానలేమి సమస్యలను తగ్గిస్తుంది. వీర్యకణాల ఉత్పత్తికి దోహదం చేయడంతో పాటు మూత్రశయ వ్యాధులను నయం చేయడంలో ఎంతో సహాయపడుతుంది.
ఇది శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. మలబద్ధకం మరియు మొలల వ్యాధికి మంచి మందుగా పనిచేస్తుంది. శంకపుష్ప ఆకుల చూర్ణాన్ని తేనెతో కలిపి సేవించడం ద్వారా మెదడు పనితీరును మెరుగుపర్చుకోవచ్చు. మతిమరుపును దూరం చేసి మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే శంకపుష్పపు వేరులో అనేక ఔషధగుణాలు దాగి ఉన్నాయి. చర్మానికి సంబంధించిన సమస్యలు, కాంతి వ్యాధులను నయం చేయగల మహత్తర శక్తి శంకపుష్ప వేరు కలిగి ఉంది.
శంకపుష్ప మొక్క యాంటీ అల్సర్ లక్షణాలు కలిగి ఉంది. కడుపులో ఏర్పడే వివిధ అల్సర్స్ ను నివారించగల శక్తి శంకపుష్ప మొక్కకు కలదు. కొన్ని అధ్యయానాల ప్రకారం హైపర్ థైరాయిడిజమ్ ను తగ్గించగల శక్తి ఈ మొక్కకు ఉందని తేలింది. ఈ మొక్క యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంది. శంకపుష్ప మొక్క ఆకులను నూరి పైపూతగా వాడితే గాయాలు మరియు పుండ్లు త్వరగా మానిపోతాయి. అలాగే సాధారణంగా వచ్చే జ్వరాలను తగ్గిస్తుంది.
అలాగే మహిళలలో వచ్చే ఋతుక్రమ సమస్య, అధిక రక్తస్రావం వంటి సమస్యలకు కూడా శంకపుష్ప మొక్క ఒక చక్కని పరిష్కారాన్ని ఇస్తుంది. అలాగే బోధకాలు వ్యాధికి ఒక మంచి మందుగా పనిచేస్తుంది. అయితే గర్భవతులు మరియు పిల్లలకు పాలిచ్చే తల్లులు మాత్రం శంకపుష్పపు మొక్కను వాడకూడదు. దాంతో పాటు ఈ మొక్కను ఎలా వాడాలి? ఎంత పరిమాణంలో వాడాలి? అనే విషయంలో మాత్రం ఆయుర్వేద వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.