కాలుష్యంపై కదిలిస్తున్న దియా మీర్జా లేఖ..ప్రతీఒక్కరూ చదవాల్సిన కథ..
ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యంపై మోడల్, యాక్టర్ దియా మీర్జా ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ అందరినీ ఆలోచింపజేస్తోంది.
- By Dinesh Akula Published Date - 12:26 PM, Wed - 10 November 21

హలో.. నేను దియా మీర్జా. నా ప్రెగ్నెన్సీ పీరియడ్ మొత్తం నేను స్మోక్ చేస్తూనే ఉన్నాను. ఇంకా పుట్టని 90శాతం మంది పిల్లలు, నేను భూమ్మీద కలుషిత గాలి పీలుస్తున్న ఈ తరుణంలో అసలు అది పెద్ద విషయం కాదని అనుకుంటున్నాను. మన భారతదేశంలోని చాలా నగరాల్లో గాలి పీల్చడం దాదాపుగా రెగ్యులర్ స్మోకింగ్‌తో సమానం.
ప్రతీ ఏటా కలుషిత గాలి వల్ల ప్రపంచవ్యాప్తంగా 7 మిలియన్ మంది చనిపోతున్నారన్నది ఐక్యరాజసమితి నివేదిక సారాంశం. కేవలం భారతదేశంలోనే ఈ కారణంతో 2019లో 9,80,000 మంది చనిపోయారు.ఇవి కేవలం లెక్కలు మాత్రమే. మనల్ని అవి కదిలించలేవు. భయపెట్టలేవు. ఎందుకంటే.. కేవలం వాటిని గణాంకాలుగా మాత్రమే మనం చూస్తున్నాం.
వాతావరణ మార్పు మన పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
ఇప్పుడొక కథ చెప్పుకుందాం. నాదే. నా ప్రగ్నెన్సీ సమయంలో బేబీకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి.. పుట్టిన చాలా రోజు వరకు నాకు దూరంగా నియోనేటల్ ఐసీయూలో గడపాల్సిన స్ధితి. ఇన్ఫెక్షన్ కు కారణం నాకు తెలియదు కానీ.. మనం జీవిస్తున్న ఈ కాలుష్యపూరిత వాతావరణంలో ఉన్న ఎంతోమంది తల్లులు.. నాకంటే తక్కువ మెడికల్ కేర్ యాక్సెస్ ఉన్నవాళ్లు ఈ సమస్యతో పోరాడుతున్నారన్నది అక్షర సత్యం.
కడుపులో ఉన్న పిండానికి కూడా వాయుకాలుష్యం వల్ల బ్యాక్టీరియా ఎఫెక్ట్ అవుతుందన్న విషయం ఎంతమందికి తెలుస్తుంది? నిరంతరాయంగా వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువుడుతున్న విషవాయువుల వల్ల కాలుష్యం ఈ స్ధాయిలో ఉందని ఎంతమంది ఊహించగలరు? ఆఖరుకు ఐపీసీసీ కూడా ఇది మానవాళికి రెడ్ కోడ్ అని అధికారికంగా ప్రకటించేసింది.
రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో అంతకంతకూ వేడెక్కుతున్న భూగోళంలోని జనాభాలో నా బిడ్డ ఇప్పుడొక భాగం. పీల్చేగాలి, తాగే నీరు, మట్టి.. ఇలా పంచభూతాలూ విషతుల్యంగా మారిన చోట నా బిడ్డ అవ్యాన్ పుట్టాడు.
Also Read : విప్లవం నీడన `గోండుల` వ్యధ
అవ్యాన్ కేవలం లెక్కలు కాదు. అతనికో రూపం ఉంది. మే 14, 2021 నాడు వాడితో పాటు పుట్టిన మరో 67వేల మంది పిల్లలను కూడా లెక్కలుగా చూడకండి. వాళ్లూ మీ లాగా నాలాగే మనుషులే.! మన పిల్లలకు బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలని మనం మాట్లాడినప్పుడల్లా ఈ సమయంలో.. కొన్నిటిని ఫిక్స్ చేయడానికి మనం ఏం చేస్తున్నామనే ప్రశ్నలకు సమాధానాలు తప్పకుండా ఇచ్చుకోవాలి.
ఒక తల్లిగా దీనిపై నేను ఆలోచిస్తున్నాను. రేపు నా బిడ్డకు ఏం జరుగుతుందని. జీవవైవిధ్యాన్ని కోల్పోతున్న ఈ క్రమంలో రేపటి రోజున నా బిడ్డ పుస్తకాల్లో తప్ప నిజంగా సహజమైన ఆవాసాలు చూడడేమోనని భయం కలుగుతోంది. ప్లాస్టిక్ లేకుండా వాడు ఒక బీచ్‌ను కూడా చూడలేని పరిస్ధితి వస్తుందేమోనని బాధ వస్తోంది. వాడు నన్ను ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడేమోనని దిగులుగా ఉంది.
ఎందుకు చెట్లన్నీ కొట్టేశారు?
నాకు ఆస్తమా ఎందుకు వచ్చింది?
అంతరించిపోకుండా పులులను ఎందుకు కాపాడలేకపోయారు?
గాలి ఎందుకు కలుషితమైంది? సముద్రాలు ఎందుకు చెత్తతో నిండిపోయాయి?
ఎటుచూసినా చెత్త ఎందుకు ఉంది? ఇది ఏ పరిస్ధితులకు దారితీస్తుంది? అని…
నా కొడుకుతో సహా పుట్టిన ప్రతీ మనిషీ ఈ భూమ్మీద ఉన్న మంచి చెడు రెండిటినీ ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. తనతో పాటు ఈ గ్రహం కూడా పెరగాలి. పచ్చగా. ఎంతకాలం మాస్క్‌లు వేసుకుంటాం. ఇవాళ కోవిడ్ కోసం.. రేపటిరోజున కాలుష్యం నుంచి తప్పించుకోవడానికి. ఎవరినీ నిందించలేం. ఎవరినీ బాధ్యులని చేయలేం. పూనుకోవాల్సింది మనమే. మీరు నేను.. ఇవాళ పుట్టిన నా బిడ్డతో సహా.. అందరం…
ఇవాళే కాలుష్యం అరికట్టడం కష్టమవుతుంటే రేపటి రోజు ఇంకెంత భయంకరంగా పరిస్ధితులు మారబోతాయో ఒక్కసారి ఊహించండి. ఒక వారం, ఒక నెల, పదేళ్లు, వందేళ్లు.. తర్వాత..? కోవిడ్ ఒక్కటి చాలు.. మన జీవితం ఒక ఏడాదిలో ఎంత మారిపోతుందో తెలియడానికి..
చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి తప్పుచేయమని మనమందరం ప్రతిజ్ఞ చేద్దాం. ఒక తల్లిగా నా బిడ్డకు మంచి వాతావరణాన్ని అందించడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తానని మాట ఇస్తున్నాను.
– రచయిత దియా మీర్జా ప్రముఖ యాంకర్, ప్రొడ్యూసర్