Fact Check: పురావస్తు తవ్వకాల్లో దొరికింది.. ఘటోత్కచుడి ఖడ్గమేనా ?
‘‘పురావస్తు తవ్వకాలు జరుగుతున్న ప్రదేశంలో ఒక భారీ ఖడ్గం దొరికింది’’ అంటూ ఓ ఫొటో(Fact Check) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- By Pasha Published Date - 06:31 PM, Sun - 16 March 25

Fact Checked By Newsmeter
ప్రచారం : ఈ ఫొటోలో కనిపిస్తున్నది పురావస్తు తవ్వకాల్లో దొరికిన భారీ ఖడ్గం.. అది ఘటోత్కచుడి ఉనికిని సూచిస్తుంది.
వాస్తవం : ఈ ప్రచారం తప్పు. వైరల్ అవుతున్న ఫొటోను ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) ద్వారా రూపొందించారు.
‘‘పురావస్తు తవ్వకాలు జరుగుతున్న ప్రదేశంలో ఒక భారీ ఖడ్గం దొరికింది’’ అంటూ ఓ ఫొటో(Fact Check) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను షేర్ చేస్తూ.. గుర్తు తెలియని పురావస్తు ప్రదేశంలో ఈ ఖడ్గాన్ని కనుగొన్నారని క్లెయిమ్ చేశారు.
ఫేస్‌బుక్‌లో ఈ ఫోటోను షేర్ చేస్తూ, “గుర్తు తెలియని పురావస్తు ప్రదేశంలో గుర్తించిన భారీ ఖడ్గం ఇది. దీని సైజు, సంక్లిష్టమైన డిజైన్ అనేవి ఘటోత్కచుడి ఉనికిని సూచిస్తున్నాయి” అని క్యాప్షన్‌లో రాశారు. ఈ పోస్టుకు ఏకంగా ఏడు లక్షల వ్యూస్ వచ్చాయి. ఎనిమిది వేలకుపైగా లైకులు వచ్చాయి. (ఆర్కైవ్)
- వైరల్ క్లెయిమ్ తప్పు అని న్యూస్‌మీటర్ గుర్తించింది. వైరల్ అవుతున్న ఫొటోను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా రూపొందించారు.
- వైరల్ అవుతున్న ఫొటోలో ఉన్న ఖడ్గాన్ని పురావస్తు శాఖ గుర్తించింది అని చూపిస్తున్న కథనాలను మేం కీ వర్డ్ సెర్చ్ ద్వారా ఇంటర్నెట్‌లో వెతికాం. ఎక్కడా అలాంటి కథనాలు దొరకలేదు. సోషల్ మీడియాలో కూడా ఎలాంటి విశ్వసనీయ సమాచారం కానీ, ఫోటోలు, వీడియోలు కానీ కనిపించలేదు.
- వైరల్ అయిన ఈ ఫొటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. మరింత సమాచారం అందించే సంబంధిత ఫొటోలు, సరిపోలే ఫొటోలు కనిపించలేదు. అయితే ఇదే ఫోటో వివిధ భాషల్లో క్లెయిమ్‌లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని మేం గుర్తించాం. జాపనీస్, అరబిక్ (లింక్ 1, లింక్ 2), రష్యన్, ఇంగ్లీష్ (లింక్ 1, లింక్ 2, లింక్ 3), హిందీ, స్పానిష్, టర్కిష్ వంటి భాషల్లోనూ ఈ ఫొటోతో తప్పుడు ప్రచారం జరుగుతోందని గుర్తించాం.
- అబ్రహమిక్ మతాలకు సంబంధించిన పవిత్ర గ్రంథాలలో ఈ ఖడ్గం గురించి ప్రస్తావించినట్టుగా కొన్ని సోషల్ మీడియా పోస్టులలో ప్రస్తావించారు. ఆదాముకి చెందిన కత్తి యెమెన్ దేశంలో దొరికిందని ఒకరు క్లెయిమ్ చేశారు.
- రష్యాకు చెందిన ఇలియా మురోమెట్స్ ఖడ్గాన్ని రష్యా పురావస్తు శాఖ కనుగొందని ఇంకొకరు సోషల్ మీడియాలో ప్రచారం రాశారు.
- వైరల్ అవుతున్న పోస్టులు అన్నింటిలో ‘పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడ్డ భారీ ఖడ్గం, ఇది భారీ దేహాలను కలిగిన మానవుల ఉనికిని సూచిస్తుందని ఆయా క్లెయిమ్‌లలో ప్రస్తావించారు.
- ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తుల ముఖాలు అస్పష్టంగా ఉన్నాయి. తవ్వకం జరుగుతున్న ప్రదేశం చుట్టూ లైటింగ్, నీడలలో అసమానతలు ఉన్నాయి. ఏఐ ద్వారా రూపొందించబడిన ఫొటోలకు ఇవి సాధారణ సంకేతాలు.
- ఈ ఫొటోను ఏఐతో రూపొందించి ఉండొచ్చనే అనుమానం మాకు వచ్చింది. దీంతో మేం Wasitai అనే టూల్‌ను వాడాం. ఇది ఏఐ ఎడిటింగ్‌లను గుర్తిస్తుంది. ఈ ఫొటో లేదా దానిలోని ముఖ్యమైన భాగం ఏఐ ద్వారా తయారైందని తేలింది.
ఏఐ ఎడిటింగ్‌లను గుర్తించే Sight Engine అనే మరొక టూల్ ద్వారా మేం ఈ ఫొటోను తనిఖీ చేశాం. ఈ ఫొటోలోని 74 శాతం భాగం ఏఐతో తయారైందని తేలింది.
వైరల్ అవుతున్న ఫొటో ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) ద్వారా తయారైంది. కాబట్టి, ఈ ప్రచారం తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.