Fact Check : బరేలీలో భారత్ భూగర్భ అణుపరీక్షలు.. భారీ బిలం !?
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో (Fact Check) ప్రకారం.. ఖాళీ స్థలంలో భారీ పేలుడు సంభవించింది.
- By Pasha Published Date - 08:51 PM, Tue - 11 March 25

Fact Checked By factly
ప్రచారం : భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌లో ఉన్న బరేలీలో భూగర్భ అణు పరీక్షలు జరిగాయి అంటూ ఒక వీడియో వైరల్ అయింది.
వాస్తవం : ఈ వీడియో వాస్తవానికి అమెరికాకు సంబంధించినది. 2007 సంవత్సరం నుంచే ఈ వీడియో ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. ఈ వీడియో క్రెడిట్స్ అమెరికా ప్రభుత్వ ఇంధన శాఖ పేరిట ఉన్నాయి. బరేలీలో అణు పరీక్ష జరిగినట్టుగా ధృవీకరించడానికి విశ్వసనీయ ఆధారాలు ఏవీ లేవు. భారతదేశంలో అణు పరీక్షలు 1974, 1998 సంవత్సరాల్లో రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో జరిగాయి. అందుకే ఈ ప్రచారం తప్పు .
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో (Fact Check) ప్రకారం.. ఖాళీ స్థలంలో భారీ పేలుడు సంభవించింది. భూగర్భ పేలుడును పోలిన పెద్ద బిలం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఉన్న రిథోరా ప్రాంతంలో నిర్వహించిన అణు పరీక్ష వీడియో ఇది అని ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియోను ‘పోఖ్రాన్ 3 అణు పరీక్ష’గా అభివర్ణించారు.ఆర్కైవ్ చేసిన పోస్ట్‌ను ఇక్కడ చూడొచ్చు.
వాస్తవ తనిఖీలో గుర్తించిన వివరాలివీ..
వైరల్ అయిన వీడియోలో ఉన్న కీఫ్రేమ్‌లను ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. దీంతో 2007 ఏప్రిల్ 12న ” భూగర్భ అణు పరీక్ష ” అనే టైటిల్‌తో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఒక వీడియో మాకు కనిపించింది. ఈ వీడియోకు సంబంధించిన వివరణ ప్రకారం.. ఇది అమెరికాలో జరిగిన చారిత్రాత్మక భూగర్భ అణు పరీక్ష వీడియో. అణు పరీక్ష జరిగాక.. అక్కడ భూమి కుంగిపోయి పెద్ద బిలం ఏర్పడింది. ఈ బిలాన్ని ఏరియా 3 రేడియోధార్మిక వ్యర్థాల నిర్వహణ సైట్‌గా వాడుతున్నట్లు తెలిసింది. ఈ పేలుడు అమెరికాలోనే జరిగిందని అమెరికా ప్రభుత్వ ఇంధన విభాగం వెల్లడించింది. ఈ విధమైన ఏడు బిలాలు అమెరికాలో అణుపరీక్షల వల్ల ఏర్పడ్డాయని పేర్కొంది.

” న్యూక్లియర్ బాంబ్ సబ్‌సిడెన్స్ క్రేటర్ ఫార్మేషన్ ” అనే శీర్షికతో 2010 జూన్ 07న అప్‌లోడ్ చేసిన మరో యూట్యూబ్ వీడియోను కూడా మేం గుర్తించాం. ‘‘అమెరికా ఇంధన విభాగం సౌజన్యంతో: చారిత్రాత్మక భూగర్భ అణు పరీక్ష జరిగింది. దీనివల్ల ఒక బిలం ఏర్పడింది. ఈ విధమైన ఏడు బిలాలను ఏరియా 3 రేడియోధార్మిక వ్యర్థాలను పారవేసేందుకు వినియోగిస్తారు’’ అని ఆ వీడియోలో ప్రస్తావించారు. ఈ వీడియో అమెరికా ప్రభుత్వ ఇంధన శాఖకు చెందినది. దీంతో ఈ అణుపరీక్ష యునైటెడ్ స్టేట్స్‌లోనే జరిగిందని తేలింది.

అమెరికాలో అణు ప్రయోగాలకు సంబంధించిన చాలా పత్రాలు, నివేదికలను ( ఇక్కడ మరియు ఇక్కడ ) మేం కనుగొన్నాం. వీటిలో భూగర్భ అణు పరీక్షల వివరాలు ఉన్నాయి. అదనంగా, వైరల్ వీడియోకు సరిపోలే అనేక అధికారిక ఫోటోలను కూడా ఈ నివేదికలలో పొందుపరిచారు.

మొత్తం మీద ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఎటువంటి అణు పరీక్ష జరగలేదని మేం నిర్ధారించాం. PIB ప్రకటన ప్రకారం.. భారతదేశం 1974లో స్మైలింగ్ బుద్ధ, 1998లో రాజస్థాన్‌లో పోఖ్రాన్-II అణు పరీక్షలు నిర్వహించింది. వీటికి మించి భారతదేశంలో అణు పరీక్షలపై అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అందువల్ల, వైరల్ వీడియోకు, భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు.