రచయిత్రి, ఇన్ఫోసిస్ ఛైర్‌పర్సన్ సుధామూర్తి తన భర్త నారాయణ మూర్తి వ్యాఖ్యలపై ఇటీవలే స్పందించారు. ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడానికి వారానికి 70 గంటలు పనిచేసే అంశాన్ని పరిగణించాలని యువతకు ఆయన చేసిన సూచన వివాదానికి దారితీసింది. ఈ సూచనపై తొలిసారి సుధా మూర్తి స్పందించారు. ఇన్ఫోసిస్ ప్రారంభ రోజులను, కంపెనీని నిర్మించడానికి చేసిన త్యాగాలను ఆమె గుర్తు చేసుకున్నారు. ఇన్ఫోసిస్ విజయంలో మ్యాజిక్ అంటూ ఏమీ లేదని, కేవలం కృషి, అదృష్టం, సరైన సమయంలో సరైన చోట ఉండటం వల్లే విజయం సాధ్యమైందన్నారు. కంపెనీ నిర్మాణాత్మక సంవత్సరాల్లో నారాయణ మూర్తి, ఆయన సహచరులు వారానికి 70 గంటలు లేదా అంతకంటే ఎక్కువ టైం పనిచేశారని సుధామూర్తి చెప్పుకొచ్చారు. లేకపోతే ఇన్ఫోసిస్ ఇంతటా సక్సెస్ అయ్యేదే కాదన్నారు. తన భర్త ఇన్ఫోసిస్‌పై చూపిన అంకితభావానికి మద్దతు ఇవ్వడానికి తాను కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నానని సుధామూర్తి చెప్పారు. ఇన్ఫోసిస్‌ను మీరు చూసుకోండి.. నేను కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని ఆయనకు భరోసా ఇచ్చానన్నారు.
ఫేక్ వీడియోలో ఇలా ఉంది..
ఇటీవలే బెట్టింగ్ యాప్‌ను సుధామూర్తి ప్రమోట్ చేస్తున్న వీడియో(Fact Check) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. ‘‘ఎలాంటి అవగాహన లేకున్నా డబ్బులు సంపాదించొచ్చు. భారతీయుల జీవితాన్ని మెరుగుపర్చడమే మా ప్రధాన లక్ష్యం. రూ. 21,000 పెట్టుబడి పెట్టి 31 రోజుల్లో రూ. 31,00,000 సంపాదించొచ్చు. మంచి డబ్బులు వస్తాయి. వీడియో కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి’’ అని ఆ వీడియోలో సుధామూర్తి చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది. వాస్తవానికి ఇందులోని ఆడియో(మాటలు) సుధామూర్తి చెప్పినవి కావు. ఏఐతో ఆ మాటలను చెప్పించి.. సుధామూర్తి ఇంటర్వ్యూ వీడియోలో జతపరిచారు. రూ.21వేలతో రూ.31 లక్షలు సంపాదించొచ్చనే మాట ఏదీ సుధామూర్తి చెప్పలేదు.