Yadagirigutta Temple : యాదగిరిగుట్ట ఆలయానికి విశ్వవ్యాప్త గుర్తింపు..కెనడా ప్రధాని ప్రశంస
ఈవై సెంటర్, ఒట్టావాలో ఇటీవలే వైభవంగా నిర్వహించిన యాదాద్రి స్వామివారి కల్యాణ మహోత్సవం సందర్భంగా ప్రధాని మార్క్ కార్నీ తన అభినందనలు తెలిపారు. ఈ లేఖలో ఆయన హిందూ సంస్కృతిలోని ఆధ్యాత్మికత, ఐక్యతా భావం, సామాజిక విలువలపై విశేషంగా ప్రశంసలు గుప్పించారు.
- By Latha Suma Published Date - 10:09 AM, Mon - 1 September 25

Yadagirigutta Temple : తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధ్యాత్మికతతో పాటు విశ్వవ్యాప్త స్థాయిలో తన ప్రాచుర్యాన్ని పెంచుకుంటోంది. తాజాగా ఈ దేవస్థానానికి అరుదైన గౌరవం దక్కింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా ఆలయ నిర్వాహకులను అభినందిస్తూ ఒక ప్రత్యేక లేఖను పంపడం విశేషంగా మారింది. ఈవై సెంటర్, ఒట్టావాలో ఇటీవలే వైభవంగా నిర్వహించిన యాదాద్రి స్వామివారి కల్యాణ మహోత్సవం సందర్భంగా ప్రధాని మార్క్ కార్నీ తన అభినందనలు తెలిపారు. ఈ లేఖలో ఆయన హిందూ సంస్కృతిలోని ఆధ్యాత్మికత, ఐక్యతా భావం, సామాజిక విలువలపై విశేషంగా ప్రశంసలు గుప్పించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనుషుల మధ్య బంధాలను బలపరుస్తాయి, భిన్న సంస్కృతులను ఒకేచోట కలిపే వేదికగా మారతాయి అని పేర్కొన్నారు.
Read Also: Chandrababu Naidu : సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మైలురాయి..తొలిసారి సీఎం అయి నేటికి 30 ఏళ్లు!
ఆలయ సేవలను నిర్వహిస్తున్న నిర్వాహకులు, సమన్వయకర్తల తపన, శ్రద్ధపై కూడా ప్రధాని ప్రశంసలు తెలిపారు. కెనడాలోని హిందూ సమాజం ద్వారా అక్కడి సాంస్కృతిక సమాజానికి దోహదం కలిగిందని, వారి విలువల పరిరక్షణలో ఈవిధమైన కార్యక్రమాలు ప్రాముఖ్యత పొందుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ లేఖకు స్పందించిన తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆలయ ఈవో వెంకట్రావు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కెనడా ప్రధాని నుంచి లభించిన అభినందన లేఖ యాదగిరిగుట్ట దేవస్థాన చరిత్రలో గర్వించదగిన ఘట్టంగా నిలిచింది. ఇది మన రాష్ట్రానికి, మన ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రపంచ గుర్తింపు తెచ్చే సంఘటన అని వారు వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో వెంకట్రావు మాట్లాడుతూ..యాదగిరిగుట్ట స్వామివారి సేవలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులకు చేరువ చేయాలనే లక్ష్యంతో విదేశాల్లో ఈవిధమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులోనూ మరిన్ని దేశాల్లో కల్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తాం.అన్నారు. ప్రస్తుతం కెనడాలోని నాలుగు రాష్ట్రాల్లో ఒంటారియో, క్యూబెక్, ఆల్బర్టా, బ్రిటిష్ కొలంబియాలో సెప్టెంబర్ 27వ తేదీ వరకు యాదాద్రి స్వామివారి కల్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. అక్కడి స్థానిక హిందూ సంఘాలు, వలస భారతీయులు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో భారతీయ సంప్రదాయాల పట్ల ఆదరణ పెరుగుతోందని, యాదగిరిగుట్ట స్వామివారి వైభవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ఇది ఒక కీలక అడుగని నిర్వాహకులు అన్నారు. ఆలయానికి లభిస్తున్న ఈ అంతర్జాతీయ గుర్తింపు భక్తుల నమ్మకానికి నిదర్శనంగా మారిందన్నారు.
Read Also: Kaleshwaram Report : కాంగ్రెస్, బిఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ – ఏలేటి