వసంత పంచమి..అక్షరాభ్యాసం చేయడానికి శుభ ముహూర్తం ఇదే!
ప్రకృతి అంతా పసుపు వర్ణంతో ఉత్సాహంగా కళకళలాడే ఈ రోజున జ్ఞానం, విద్య, కళలకు అధిదేవతైన సరస్వతీ దేవిని భక్తులు విశేషంగా ఆరాధిస్తారు. విద్యారంభం, జ్ఞానాభివృద్ధికి ఇది అత్యంత శుభకరమైన దినంగా పండితులు పేర్కొంటున్నారు.
- Author : Latha Suma
Date : 23-01-2026 - 4:30 IST
Published By : Hashtagu Telugu Desk
. జనవరి 23న వసంత పంచమి శుక్రవారం శుభయోగం
. బాసర క్షేత్ర మహిమ..ఇసుకతో అమ్మవారి ప్రతిష్ఠ
. అక్షరాభ్యాసం, విద్యా విజయాలు ..శుభాకాంక్షల సందేశం
Vasant Panchami 2026 : ఈ ఏడాది వసంత పంచమి పర్వదినం జనవరి 23 శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మాఘ మాస శుక్ల పక్షంలో వచ్చే ఈ పండుగ వసంత ఋతువుకు ఆరంభ సూచికగా భావించబడుతుంది. ప్రకృతి అంతా పసుపు వర్ణంతో ఉత్సాహంగా కళకళలాడే ఈ రోజున జ్ఞానం, విద్య, కళలకు అధిదేవతైన సరస్వతీ దేవిని భక్తులు విశేషంగా ఆరాధిస్తారు. విద్యారంభం, జ్ఞానాభివృద్ధికి ఇది అత్యంత శుభకరమైన దినంగా పండితులు పేర్కొంటున్నారు.
వసంత పంచమికి బాసర క్షేత్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. వ్యాసమహర్షి గోదావరి తీరంలోని బాసరలో ఇసుకతో సరస్వతీ దేవిని ప్రతిష్టించిన రోజే వసంత పంచమి అని పురాణ కథనం. దీర్ఘకాల తపస్సు అనంతరం జ్ఞానప్రదాయినిగా అమ్మవారు అవతరించారని విశ్వాసం. అందుకే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు బాసరకు తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా చిన్నారుల అక్షరాభ్యాసానికి బాసర ప్రసిద్ధి చెందింది. ఈ రోజున చేసే పూజలు, వ్రతాలు విద్యాబుద్ధులను ప్రసాదిస్తాయని భక్తుల నమ్మకం.
వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు ఉన్నత విద్యావంతులు అవుతారని పండితులు చెబుతున్నారు. “ఓం ఐం సరస్వత్యై నమః” అనే మంత్రోచ్ఛారణతో విద్యారంభం చేయడం ఆనవాయితీ. విద్యార్థులు పుస్తకాలు, వాద్యాలు, కలాల పరికరాలను అమ్మవారి ముందు ఉంచి ఆశీర్వాదాలు కోరుకుంటారు. ఉద్యోగాల్లో ఉన్నవారు జ్ఞానంతో పాటు నైపుణ్యాలు పెరిగి ప్రగతి సాధించాలని ప్రార్థిస్తారు. ఈ పర్వదినం సందర్భంగా ప్రతి ఇంటా పసుపు వర్ణ వస్త్రాలు, పుష్పాలతో పూజలు నిర్వహిస్తూ ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకుంటారు. సరస్వతీ దేవి కరుణా కటాక్షాలు అందరిపై నిలిచి విద్యలో, ఉద్యోగాల్లో, కళలలో ప్రతిభ వెలుగొందాలని కోరుకుంటూ వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జ్ఞానం వెలుగులు నింపే ఈ పవిత్ర దినం ప్రతి ఒక్కరి జీవితంలో సఫలతలు సద్గుణాలు పుష్కలంగా ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నారు.