Vijayadashami: రేపే దసరా.. విజయదశమి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
ఈ రోజు శుభ ముహూర్తంగా భావిస్తారు. కాబట్టి కొత్త వ్యాపారం, ఉద్యోగంలో చేరడం, విద్య ప్రారంభించడం వంటి ఏ కొత్త ప్రయత్నం చేసినా విజయం లభిస్తుంది.
- By Gopichand Published Date - 04:58 PM, Wed - 1 October 25

Vijayadashami: శరన్నవరాత్రి ఉత్సవాల పరాకాష్ట, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి (Vijayadashami) పండుగ రేపు (అక్టోబర్ 2) ఘనంగా జరుపుకోనున్నారు. ఈ పండుగ రోజున శుభ ఫలితాలు పొందడానికి, అపశకునాలు దరిచేరకూడదంటే హిందూ సంప్రదాయాలు, ధర్మశాస్త్రాలు నిర్దేశించిన కొన్ని నియమాలను తప్పక పాటించాలి. ఈ పవిత్రమైన రోజున చేయవలసిన, చేయకూడని పనుల వివరాలు తెలుసుకుందాం.
దసరా రోజున తప్పక చేయాల్సిన శుభ కార్యాలు
దసరాను అపరాజితా పూజ దినంగా పరిగణిస్తారు. ఈ రోజున ఏ పని మొదలుపెట్టినా విజయం తథ్యం అని నమ్ముతారు.
ఆయుధ పూజ/వాహన పూజ: దసరా రోజున ముఖ్యంగా ఆయుధ పూజ లేదా వాహన పూజ చేస్తారు. ఉద్యోగులు తమ పనిముట్లకు, వ్యాపారులు తమ యంత్రాలకు, రైతులు తమ వ్యవసాయ పరికరాలకు పూజలు చేయడం శుభప్రదం. ఇది వాటిని కాపాడుతుందని, మంచి ఫలితాలు ఇస్తుందని విశ్వాసం.
శమీ పూజ (జమ్మి చెట్టు): విజయదశమి నాడు సాయంత్రం జమ్మి చెట్టు (శమీ వృక్షం) వద్దకు వెళ్లి పూజ చేయడం అత్యంత ముఖ్యమైన ఆచారం. పాండవులు అజ్ఞాతవాసం ముగించి జమ్మి చెట్టుపై దాచిన ఆయుధాలను తీసుకున్న సందర్భాన్ని ఇది గుర్తు చేస్తుంది. జమ్మి ఆకులను ఇచ్చిపుచ్చుకోవడం వల్ల సకల విజయాలు, ధన లాభాలు కలుగుతాయని నమ్మకం.
ఇంటిని శుభ్రం చేయాలి: దసరా రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసి, ముంగిట రంగులతో రంగవల్లికలు (ముగ్గులు) వేసి అలంకరించాలి. లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఇది ముఖ్యమైనది.
నైవేద్యం సమర్పణ: ఇంటి ఇలవేల్పుకు నైవేద్యం సమర్పించి, ఇంటిల్లిపాది ఆశీస్సులు తీసుకోవాలి.
కొత్త ప్రారంభాలు: ఈ రోజు శుభ ముహూర్తంగా భావిస్తారు. కాబట్టి కొత్త వ్యాపారం, ఉద్యోగంలో చేరడం, విద్య ప్రారంభించడం వంటి ఏ కొత్త ప్రయత్నం చేసినా విజయం లభిస్తుంది.
Also Read: IAS : తెలుగు రాష్ట్రాల్లో ఈ ఐఏఎస్ అధికారిణి గురించి పరిచయం అక్కర్లేదు!
దసరా రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు
మత విశ్వాసాల ప్రకారం దసరా రోజున కొన్ని పనులు చేయడం అశుభం.
మాంసాహారం, మద్యం సేవించరాదు: దసరా పండుగ పూర్తిగా పవిత్రమైనది. ఈ రోజున తామస గుణాన్ని పెంచే మాంసాహారం, మద్యం సేవించడం పూర్తిగా నిషేధం.
ఇంట్లో గొడవలు తగదు: పండుగ రోజున కుటుంబ సభ్యులు లేదా ఇతరులతో గొడవలు, కలహాలు పెట్టుకోవడం, దూషించడం చేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారని నమ్ముతారు.
చేపట్టిన పనులు మధ్యలో ఆపరాదు: విజయదశమి రోజు ఏ పని మొదలుపెట్టినా దాన్ని మధ్యలో ఆపకుండా పూర్తి చేయాలి. లేకపోతే ఆ పనిలో అపజయం పొందే అవకాశం ఉంటుంది.
ఇంట్లో చీకటి ఉండరాదు: సాయంత్రం వేళ ఇంటిని చీకటిగా ఉంచరాదు. ప్రతి గదిలో దీపాలు లేదా లైట్లు వెలిగించి ఉంచడం శుభకరం.
ఇతరులను అవమానించరాదు: పేదవారిని, వృద్ధులను లేదా ఇతరులను అవమానించడం, నిందించడం చేయకూడదు. దానధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.