Mukkoti Ekadashi : ముక్కోటి ఏకాదశి ఇవాళే.. శ్రీమహావిష్ణువుకే వరమిచ్చిన మధుకైటభుల పురాణగాథ
Mukkoti Ekadashi : ముక్కోటి ఏకాదశి ఇవాళే. ఏటా మార్గశిర మాసం శుక్లపక్షంలో ఇది వస్తుంది.
- By Pasha Published Date - 08:01 AM, Sat - 23 December 23

Mukkoti Ekadashi : ముక్కోటి ఏకాదశి ఇవాళే. ఏటా మార్గశిర మాసం శుక్లపక్షంలో ఇది వస్తుంది. యోగనిద్ర నుంచి మేల్కొన్న శ్రీమహావిష్ణువును ప్రాతః కాల సమయంలో ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకొని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునే పుణ్య సమయం కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లోనూ ముక్కోటి ఏకాదశి అత్యంత పవిత్రమైనది. అన్ని ఏకాదశులను పాటించడం కుదరని వారు, కనీసం ఈ రోజైనా ఆచరించాలి. ఎందుకంటే ఇవాళ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. భక్తులకు మోక్షాన్ని ఇచ్చే ఏకాదశి కాబట్టి ఈ రోజును మోక్షదా ఏకాదశి అని కూడా పిలుస్తారు. శ్రీప్రశ్న సంహిత అనే గ్రంథంలో ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం స్వామిని దర్శించుకోవడం ద్వారా మోక్షప్రాప్తి లభిస్తుందని పండితులు చెబుతారు. ఇవాళ విష్ణు ఆలయాల్లో, వైకుంఠధామంలో ఉన్న శ్రీమన్నారాయణుడిని ఉత్తర ద్వారం నుంచి వెళ్లి భక్తులు దర్శించుకుంటారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇవాళ శ్రీమహావిష్ణువు చిత్రపటానికి తులసీదళాలు, జాజిపూలు, పారిజాతాలు, మందారం వంటి పూలతో అలంకరించి ప్రాతఃకాలమే పూజ చేసుకోవాలి. పూజలు ధూప, దీపాలను సమర్పించి ఆవుపాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. అరటి పండ్లు నైవేద్యం పెట్టినా సరిపోతుంది. స్వామికి పచ్చ కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి. ఈ రోజంతా ఉపవాస దీక్షను ఆచరించాలి. శరీరం సహకరించని వారు పాలు, పండ్లు తీసుకుని ఉండవచ్చు. కానీ అన్నం మాత్రం తినకూడదు. ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పారాయణం ఈరోజు చేస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. ఇక ఇది వీలుపడని వారు గోవింద నామాలు చదువుకున్నా ఫలితం ఉంటుంది.
Also Read: China – Nuclear Tests : మరోసారి అణుబాంబులతో చైనా టెస్ట్ ?
పురాణాల ప్రకారం.. మధుకైటభులు అనే ఇద్దరు రాక్షసులతో శ్రీ మహావిష్ణువు యుద్ధం చేస్తారు. కానీ గెలవలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు మీకు ఏం వరం కావాలో కోరుకోమని స్వామి వారిని కోరుతారు. వారు గర్వంతో.. మాకు నువ్వు వరం ఇచ్చేదేంటి.. మేమే నీకు ఇస్తాం, కోరుకో అంటారు. దాంతో స్వామి వారిద్దరినీ తన చేతిలో చనిపోవాల్సిందిగా వరం కోరతారు. అందుకు ఆ రాక్షసులు ఒప్పుకొని చనిపోతారు. అలా మాట నిలబెట్టుకున్నందుకు వారిని స్వామి.. ఉత్తర ద్వారం ద్వారా వైకుంఠధామంలోకి పంపిస్తారు. అలా లోపలికి వెళ్లిన వారు మంచివారిగా మారిపోతారు. దాంతో తమకు కలిగిన భాగ్యాన్ని అందరికీ కల్పించాలని ఆ రాక్షసులు కోరతారు. అందుకు స్వామి ఒప్పుకుంటారు.
గమనిక: ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుంచి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాన్ని వినియోగదారులు కేవలం సమాచారంగా తీసుకోవాలి.