Koti Deepotsavam: ఘనంగా కోటి దీపోత్సవం, శివనామస్మరణతో మార్మోగిన ఎన్టీఆర్ స్టేడియం
- By Balu J Published Date - 04:56 PM, Sat - 18 November 23

Koti Deepotsavam: మన సంస్కృతికి సంప్రదాయానికి దీపారాధన పట్టుగొమ్మగా నిలుస్తుంది. అందుకే భారతీయ మహిళలు విధిగా దీపారాధణ చేస్తుంటారు. అలాంటివాళ్ల కోసమే హైదరాబాద్ లో కోటిదీపోత్సవం ప్రతి ఏడు ఘనంగా జరుగుతుంటుంది. ఈ నెల 14 మంగళవారంతో మొదలై, నవంబర్ 27 వరకు హైదరాబాద్, ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది. ఈ కార్తీక మాసాన ఆ శివకేశవ సాక్షిగా సాగే కోటిదీపార్చన మహోత్సవంలో పాల్గొని.. అపూర్వ సాంస్కృతిక కదంబాలు.. సప్తహారతుల కాంతులు.. కోటి దీపాల వెలుగులో భక్తులు తన్మయత్వం పొందుతున్నారు.
నవంబర్ 27వరకు జరగనున్న ఈ దీపోత్సవంలో వేదికనెక్కే వేద పండితులు, అతిథులుగా హాజరయ్యే అతిరథమహారథులు, ప్రతిరోజూ వేలు, లక్షలుగా భక్త జనం పాల్గొంటున్నారు. లక్ష దీపాల అంకురార్పణతో ప్రారంభమైన ఈ మహాదీపయజ్జం.. కోటిదీపోత్సవంగా మారింది.. క్రమంగా ఆధ్యాత్మిక జగత్తులో మహోద్యమంగా కొనసాగుతోంది. ప్రతీ ఏడాది నిరాటంకంగా కొనసాగుతోంది. ఆ కైలాసమే ఇలకి దిగివచ్చిందా అనేలా.. కోటిదీపోత్సవ వేదికను ముస్తాబు చేశారు. ఒక్కసారైనా కోటిదీపోత్సవానికి వెళ్లాలి అనేలా భక్తులలో ఉత్సాహాన్ని కలిగిస్తోంది.