2026 మార్చి 3న తొలి చంద్రగ్రహణం
- Author : Vamsi Chowdary Korata
Date : 06-01-2026 - 10:18 IST
Published By : Hashtagu Telugu Desk
Chandra Grahan సూర్యుడి చుట్టూ భూమి కక్ష్యలో ఉన్నప్పుడు చంద్రుడు, సూర్యుడికి మధ్యలో భూమి వస్తుంటుంది. ఆ సమయంలో సూర్యుడి కాంతి చంద్రుడిని చేరుకోలేదు. సూర్యుడు, చంద్రుడు, భూమి వాటి వాటి కక్ష్యలో ఒకే వరుసలో ఉన్నప్పుడు మాత్రమే ఇది సంభవిస్తుంది. ఆ సమయంలో భూమి యొక్క నీడ చంద్రుడిపై పడుతుంది. దీంతో చంద్రుడిపై నీడ ఉన్న భాగం చీకటిగా మారుతుంది. దీనినే చంద్రగ్రహణం అంటారు. ఈ నేపథ్యంలో చంద్రగ్రహణం 2026 తేదీ, సమయం వంటి విషయాలు తెలుసుకుందాం.
సాధారణంగా ఉత్తరాది వాళ్లకి తెలుగు నెల పౌర్ణమితో ముగిస్తే.. దక్షిణాది వాళ్లకు అమావాస్యతో పూర్తవుతుంది. అందుకే దక్షిణాది వాళ్ల కన్నా 15 రోజుల ముందే ఉత్తరాది వారికి కొత్త మాసం ప్రారంభమవుతుంది. ఈ ప్రకారం కొత్త ఏడాది 2026లో మొదటి పౌర్ణమి జనవరి 3వ తేదీన వచ్చింది. కానీ ఉత్తరాది వాళ్లకి జనవరి 4వ తేదీ నుంచి మాఘ మాసం ప్రారంభమవుతుంది. ఇక సాధారణంగా చంద్రగ్రహణం పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. అలాగే సూర్య గ్రహణం అమావాస్య రోజున ఏర్పడుతుంది. అందుకే పౌర్ణమి రాగానే ఈరోజు చంద్రగ్రహణం ఉందా అనే సందేహపడుతుంటారు.
ప్రతి పౌర్ణమి రోజు చంద్రగ్రహణం కాదు!
చంద్రగ్రహణం ఎప్పుడూ పౌర్ణమి రోజు మాత్రమే సంభవిస్తుంది అనేది వాస్తవం. కానీ చంద్రగ్రహణం వంటి సంఘటన ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజు కాకుండా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సంభవిస్తుంది. వాస్తవానికి చంద్రుడి కక్ష్య భూమి కక్ష్య కంటే సుమారు 5 డిగ్రీలు వంగి ఉంటుందట. ఈ కారణంగా పౌర్ణమి రోజుల్లో చంద్రుడు భూమి మీద నుంచి లేదా క్రింద నుంచి వెళతాడు కానీ గ్రహణం ఏర్పడదు. సూర్యుడు, భూమి, చంద్రుడు పూర్తిగా ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు మాత్రమే చంద్రగ్రహణం సంభవిస్తుంది.
మార్చి 3న తొలి చంద్రగ్రహణం
ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం 2026 మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమై.. అదేరోజు సాయంత్రం వేళ 6.47 గంటలకు ముగుస్తుందని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కారణంగా ఆరోజున తిరుమల ఆలయాన్ని సైతం మార్చి 3వ తేదీ ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు మూసివేయనున్నట్లు పేర్కొంది.
శ్రీవారి ఆలయంలో పలు సేవలు రద్దు
గ్రహణం ముగిసిన అనంతరం గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి అనంతరం భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఆరోజున రాత్రి 8.30 గంటల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అంతే కాకుండా ఈ చంద్రగ్రహణం 2026 నేపథ్యంలో మార్చి 3వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టాదళ పాద పద్మారాధన సేవ, ఊంజల్ సేవ, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవలను సైతం రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
2026 తొలి చంద్రగ్రహణం ప్రత్యేకత ఏమిటంటే
నూతన సంవత్సరం 2026లో తొలి చంద్రగ్రహణం మార్చి 3వ తేదీన అంటే హోలీ పౌర్ణమి రోజున సంభవిస్తుంది. ఈ ఏడాది హోలీ (Holi 2026) పండుగ మార్చి 4వ తేదీన జరుపుకోనున్నారు. కానీ హోలీ పౌర్ణమి రోజున మార్చి 2వ తేదీ 5:56 PM నుంచి మార్చి 3వ తేదీ 5:07 PM వరకు ఉంటుంది. కాబట్టి మార్చి 3వ తేదీ హోలీ పౌర్ణమి రోజునే 2026 తొలి చంద్రగ్రహణం సంభవించడం విశేషం.