Temple Traditions: గుడిలో గడపకు ఎందుకు నమస్కారం చేస్తారో తెలుసా??
హిందూ సంప్రదాయంలో దేవాలయ సందర్శన, దైవ దర్శనం అత్యంత ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యాలు. దైవ దర్శనం కోసం దేవాలయానికి వెళ్లే భక్తులు, లోపలికి అడుగు పెట్టే ముందు ప్రధాన ద్వారం వద్ద ఉన్న గడపకి నమస్కరించడం ఒక సాధారణం. కానీ ఎందుకు అలాంటి ప్రాధాన్యం గడపకి?
- By Kode Mohan Sai Published Date - 05:30 AM, Sun - 1 June 25

Temple Traditions: హిందూ సంప్రదాయంలో దేవాలయ సందర్శన, దైవ దర్శనం అత్యంత ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యాలు. దేవాలయాలను దర్శించడం వలన మనలో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అన్నది చాలామందిలో గాఢమైన విశ్వాసం. ఇందుకు కారణం ఆలయ పరిసరాలలో ఉండే ఆధ్యాత్మిక శక్తులు, శాంతిమయ వాతావరణం, మరియు తత్వబోధక నిర్మాణ శైలి.
దైవ దర్శనం కోసం దేవాలయానికి వెళ్లే భక్తులు, లోపలికి అడుగు పెట్టే ముందు ప్రధాన ద్వారం వద్ద ఉన్న గడపకి నమస్కరించడం ఒక సాధారణం. కానీ ఎందుకు అలాంటి ప్రాధాన్యం గడపకి? దీని వెనుక ఏమున్నది? ఈ ఆచారం ఉద్భవం ఎలా జరిగింది? అనే ప్రశ్నలు మనలో తలెత్తవచ్చు.
భగవంతునికి – భక్తునికి మధ్య అనుసంధానంగా దేవాలయం
భారతీయ సంప్రదాయంలో ఆలయాలు కేవలం ఆరాధనా స్థలాలు మాత్రమే కాదు. అవి భక్తి, ఆధ్యాత్మికత, సంస్కృతి, మరియు సమాజం మధ్య సంబంధాన్ని బలపరచే కేంద్రాలుగా ఉండేవి. భగవంతుడిని చేరుకునే మార్గాల్లో, దేవాలయ సందర్శనం అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు. ఇందుకే, భక్తులు భగవంతుని కరుణ కోసం దేవాలయాలు దర్శిస్తారు. ఇది ఒక ఆంతరిక ప్రయాణం – మనస్సు శుద్ధి చేసుకునే మార్గం కూడా.
గడపకు నమస్కారం ఎందుకు?
దేవాలయాల్లోకి ప్రవేశించే ముందు, భక్తులు బయట కాళ్లు శుభ్రంగా కడుక్కుని, ప్రధాన ద్వారం వద్ద ఉన్న గడపకు నమస్కారం చేయడం అనేది ఒక సాంప్రదాయంగా నేటికీ కొనసాగుతోంది. సాధారణంగా ఇళ్ల గడపలు చెక్కతో తయారవుతుంటే, దేవాలయాల గడపలు రాతితో నిర్మించబడ్డవి.
ఆలయం లోపలికి అడుగు పెట్టే క్షణంలో, ఆ గడపను నమస్కరించడం వెనుక ఒక ఆధ్యాత్మిక విశ్వాసం ఉంది – అది గడపనే ఆలయ ప్రవేశ ద్వారం కాదు, అది దివ్య లోకానికి ప్రవేశ ద్వారం అనే భావన. ఈ చిన్నచిన్న ఆచారాల వెనుక ఉన్న ఆధ్యాత్మికత, భావనల గురించి తెలుసుకోవడం మన సంప్రదాయాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.
పర్వత శిలల నుండి పుట్టిన పవిత్ర గడప
దేవాలయ గడపలు సాధారణ రాయిలు కావు. అవి పర్వతాల శిలలతో తయారవుతాయి. హిందూ పురాణాల ప్రకారం, ఎందరో మహాభక్తులు స్వయంగా పర్వతరూపంలో భగవంతునికి సేవ చేస్తున్నట్టు చెబుతారు. భద్రుడు “భద్రాచలం”గా, హిమవంతుడు “హిమాలయాలు”గా, నారాయణుడు “నారాయణాద్రి”గా వెలిశారన్నది పురాణ గాధ.
ఈ భక్తుల నిరంతర ధ్యానం, భక్తి శ్రద్ధ పట్ల కృతజ్ఞతగా, భగవంతుడే ఆ కొండలపై అవతరించాడు. అందుకే ఆ దివ్యమైన శిలల నుంచే ఆలయాల్లో గర్భగుడి ప్రవేశ ద్వారం, లేదా గడప నిర్మించబడుతుంది.
గడపకు నమస్కారానికి అసలైన కారణం ఇదే!
ఈ రాయి స్వరూపంగా, ఆ భక్తుల భక్తి శక్తి నివసిస్తున్నదని విశ్వాసం. అలాంటి పవిత్ర రాయిని, కాలితో తొక్కుతూ లోపలికి అడుగుపెట్టడం అనుచితం అని పెద్దలు చెబుతారు. “క్షమించు” అనే వినమ్రతతో, గడపకు తలవంచి నమస్కరించడం అనేది ఒక ఆత్మవిమర్శన, భక్తి భావనకు ప్రతీక.
ద్వారాన్ని దాటి లోపలికి ప్రవేశించేముందు నమస్కరించడం ద్వారా మనం దైవ సన్నిధిలోకి ప్రవర్తించడానికి సిద్ధమవుతాం. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, గడపపై అడుగు పెట్టకుండా, గడపకు నమస్కరిస్తూ గర్భగుడికి వెళ్లాలని చెప్పబడింది.
ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఓ ఆధ్యాత్మిక పరిణతి. దేవాలయ గడపకు నమస్కరించడం అనేది పవిత్రతకు, భక్తికి, వినయానికి చిహ్నం. ఈ కథనం చదివిన తరువాత, ఇకమీదట మీరు దేవాలయానికి వెళ్లినప్పుడు, ఆ గడపకు నమస్కరించడం మాత్రం మర్చిపోవద్దు.