Shani Remedies: శని బాధలు తొలగిపోయి, సకల శుభాలు కలగాలంటే శనివారం రోజు ఇలా చేయాల్సిందే!
శనీశ్వరుడికి సంబంధించి శని బాధలతో బాధపడుతున్న వారు, సకల శుభాలు పొందడం కోసం శనివారం రోజు ఎప్పుడు చెప్పబోయే పరిహారాలు తప్పకుండా పాటించాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 10:02 AM, Fri - 25 April 25

హిందూ సంప్రదాయం ప్రకారం శనివారం ఎంతో ప్రత్యేకమైనది. శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఈ శనివారం రోజున శనీశ్వరుని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించి, ఆయనకు ఇష్టమైన పదార్థాలను సమర్పించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అలాగే శనివారాన్ని స్థిరవారం అని కూడా అంటారు. గ్రహాల గమనం వలన ఏలినాటి శని, అర్ధాష్టమ శని వచ్చినప్పుడు మనం అనుకున్న పనులు ఆలస్యం కావడం కానీ, ఆరోగ్య సమస్యలు ఏర్పడడం గాని జరుగుతుంటాయి. ఇవన్నీపెద్ద సమస్యలు కానప్పటికీ, మన నిత్య జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలాంటప్పుడు శని బాధలు పోగొట్టుకొని సకల శుభాలు పొందాలంటే శనివారం ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శనివారం శనిదేవుని ఆరాధనకు ప్రధానమైనదిగా భావిస్తారు. అంతే కాకుండా ఈ రోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామికి, ఆంజనేయస్వామికి ఎంతో ప్రీతికరమైనది అంటారు. ఇంతటి విశిష్టమైన శనివారాన్ని కొందరు చెడు దినంగా భావించి కొత్త పనులను ప్రారంభించరు. కాగా హిందూ పురాణాల ప్రకారం శని దేవుడిని కర్మ, న్యాయాధిపతిగా పరిగణిస్తారు. అన్నింటి కంటే నెమ్మదిగా ప్రయాణించేది శని గ్రహమే. అందుకే శనికి మందగమనుడు అనే పేరు కూడా ఉంది. శని దేవుడు మంచి చేసిన వారికి మంచి, చెడు చేసిన వారికి చెడు ఫలితాలను ఇస్తుంటాడు. ఇకపోతే శని దోషాలకు పరిహారాల విషయానికి వస్తే..
ఏలినాటి శని, అర్దాష్టమ శని, అష్టమ శని ప్రభావం వలన కలిగే చెడు ఫలితాలను తగ్గించడానికి శనివారం కొన్ని విశేషమైన కార్యక్రమాలను చేయాలని శాస్త్రం చెబుతోంది.
శనివారం నాడు నలుపు రంగు దుస్తులు ధరించి నవగ్రహాలు ఉన్న ఆలయంలో శనీశ్వరునికి తైలాభిషేకం చేయిస్తే మంచిదట. అలాగే శనీశ్వరుని వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించి, బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలట. ఈ నైవేద్యాన్ని ఇంటికి తీసుకెళ్లకూడదట. అలాగే నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వల్ల శని అనుగ్రహానికి పొందవచ్చట. కాగా శనివారం వేంకటేశ్వరుని పూజిస్తే శని దేవుని అనుగ్రహం లభిస్తుందట. ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరించి వేంకటేశ్వరుని ఆలయాన్ని సందర్శించి కొబ్బరికాయ కొట్టి మొక్కుకుంటే మొక్కులు నెరవేరుతాయట. అదేవిధంగా శనివారం ఆంజనేయ స్వామిని కొలిచిన వారికి శని బాధలు ఉండవని అంటారు. శనివారం ఆంజనేయస్వామికి 11 ప్రదక్షిణలు చేయాలి. అలాగే శనివారం వడమాల సమర్పిస్తే శని బాధలు తొలగిపోతాయట. శనివారం నాడు ఇనుము వస్తువులు, నల్ల నువ్వులు, నూనె, ఉప్పు వంటి పదార్ధాలు కొనుగోలు చేయకూడదని చెబుతున్నారు