Shani Dosha: శని బాధల నుంచి విముక్తి పొందాలా.. అయితే శనివారం రోజు ఈ పరిహారాలు పాటించాల్సిందే!
Shani Dosha: శనికి సంబందించిన సమస్యలతో బాధపడేవారు శనివారం రోజు ఇప్పుడు చెప్పబోయే పరిహారాలను పాటించాలని చెబుతున్నారు. ఇంతకీ ఆ పరిహారాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:00 AM, Wed - 19 November 25
Shani Dosha: మాములుగా ప్రతి ఒక్కరూ గ్రహాల గమనం కారణంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శనితో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సమయంలో ఎలాంటి పనులు తలపెట్టినా కూడా పనులు ఆలస్యం అవ్వడంతో పాటు కొన్ని కొన్ని సార్లు అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. కాగా ఇవన్నీ చెప్పుకోడానికి పెద్ద సమస్యలు కాకపోయినప్పటికీ, మన నిత్య జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. అయితే ఇలాంటి బాధలు ఉండకూడదు అంటే శనివారం రోజు ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు పాటిస్తే చాలు అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వారంలో ఏడవ రోజైన శనివారానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామికి అలాగే ఆంజనేయస్వామికి ఎంతో ప్రీతికరమైనది అంటారు. ఇంతటి విశిష్టమైన శనివారాన్ని కొందరు చెడు దినంగా భావించి కొత్త పనులను ప్రారంభించరు. ఈ సందర్భంగా మనం ఒక విషయాన్ని గ్రహించాలి. శని గ్రహ ప్రభావం వలన కలిగే శని చెడు ప్రభావాన్ని తగ్గించడానికి శనివారం కొన్ని విశేషమైన కార్యక్రమాలను చేయాలని శాస్త్రం చెబుతోంది. శనివారం నాడు నలుపు రంగు దుస్తులు ధరించి నవగ్రహాలు ఉన్న ఆలయంలో శనీశ్వరునికి తైలాభిషేకం చేయిస్తే చాలా మంచిదట. శనీశ్వరుని వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించి, గుడం అంటే బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలట.
ఈ నైవేద్యాన్ని ఇంటికి తీసుకెళ్లకూడదని, నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలని, ఇలా చేయడం వలన శని అనుగ్రహాన్ని పొందవచ్చని చెబుతున్నారు. శనివారం వేంకటేశ్వరుని పూజిస్తే శని దేవుని అనుగ్రహం కలుగుతుందట. ఈ రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించి వేంకటేశ్వరుని ఆలయాన్ని సందర్శించి కొబ్బరికాయ కొట్టి మొక్కుకుంటే మొక్కులు నెరవేరుతాయని చెబుతున్నారు. శనివారం ఆంజనేయ స్వామిని కొలిచిన వారికి శని బాధలు ఉండవట. శనివారం ఆంజనేయస్వామికి 11 ప్రదక్షిణాలు చేయాలని చెబుతున్నారు. అలాగే హనుమంతునికి శనివారం వడమాల సమర్పిస్తే శని బాధలు తొలగిపోతాయట.
శనివారం ఆంజనేయునికి ఆకుపూజ చేయిస్తే ఎలాంటి కష్టాలు అయినా తొలగిపోతాయని చెబుతున్నారు. శనివారం పరమేశ్వరునికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైనది. ఒక నియమం ప్రకారం 5 శనివారాలు కానీ, 9 శనివారాలు కానీ శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అనారోగ్య సమస్యలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయట. శనివారం శివాలయం ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు కింద దీపం పెట్టి, రావి చెట్టు చుట్టూ 9 ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలంగా పీడిస్తున్న సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. అలాగే శనివారం ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకూడదట. డబ్బు అప్పుగా తీసుకోకూడదట. శనివారం నూతన వాహనాలు, ఇనుము వస్తువులు, నల్ల నువ్వులు, నూనె, ఉప్పు వంటి పదార్ధాలు కొనుగోలు చేయకూడదని చెబుతున్నారు.