Ratna Bhandagar : తెరుచుకున్న జగన్నాథుడి ‘రత్న భాండాగారం’.. ఖజానా లెక్కింపు షురూ
ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు ఒడిశాలోని పూరీలో ఉన్న రత్న భాండాగారం రహస్య గదిని 46 ఏళ్ల భారీ విరామం తర్వాత తెరిచారు.
- By Pasha Published Date - 02:30 PM, Sun - 14 July 24

Ratna Bhandagar : ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు ఒడిశాలోని పూరీలో ఉన్న రత్న భాండాగారం రహస్య గదిని 46 ఏళ్ల భారీ విరామం తర్వాత తెరిచారు. జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం రత్న భాండాగారం(Ratna Bhandagar) గదిని తెరిచారు. ఈమేరకు ఒడిశా సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
We’re now on WhatsApp. Click to Join
అంతకంటే ముందు రత్న భాండాగారాన్ని తిరిగి తెరిచేందుకు అనుమతి కోరే ‘అగ్న్యా’ అనే పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజలు పూర్తయిన అనంతరం జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ సభ్యులు గది తలుపులను తెరిచారు. సుదీర్ఘకాలం తర్వాత ఈ గది తలుపులు తెరుస్తున్నందున.. లోపల పాములు ఉంటాయనే ఆందోళన నెలకొంది. దీంతో పాములు పట్టే వాళ్లను, డాక్టర్లను వెంట పెట్టుకొని కమిటీ సభ్యులు గదిలోకి ప్రవేశించారు. గదిలో పెచ్చులూడే పరిస్థితి ఉంటే వెంటనే మరమ్మతులు చేయడానికి పురావస్తు శాఖ టీమ్ కూడా వెళ్లింది. రత్న భాండాగారం లోపల చీకటిగా ఉండటంతో సెర్చ్ లైట్లను తీసుకెళ్లారు.
ఈ గదిలో ఉన్న సంపదను మరోచోటుకు తరలించి లెక్కిస్తామని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ వెల్లడించారు. లెక్కింపు వివరాల నమోదును డిజిటలైజేషన్ చేస్తామన్నారు. పూరీ జగన్నాథుడి(Puri Jagannath Temple) రత్న భాండాగారాన్నిచివరిసారిగా 1978 సంవత్సరంలో తెరిచారు. అప్పుడు రూపొందించిన జాబితా ప్రకారం.. ఈ గదిలో 12,831 భరీల బంగారం, 22,153 భరీల వెండి, అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు, ఇతర నగలు ఉన్నాయి. వాటిని లెక్కించడానికి అప్పట్లో 70 రోజుల టైం పట్టింది.
Also Read :Avoid Traffic Challan : గూగుల్ మ్యాప్స్‌లోని ఈ ఫీచర్లు వాడితే.. ట్రాఫిక్ ఛలాన్ల బెడదకు చెక్
రత్న భాండాగారానికి రక్షణగా పాము ఉందని కొంత మంది భావిస్తుంటారు. ఆ వదంతులను బలభద్రుని ప్రధాన సేవకుడైన హలధర్ దశమోహపాత్ర కొట్టిపారేశారు. ముందు జాగ్రత్తగా అధీకృత సిబ్బంది, పాములు పట్టే వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించారు. భాండాగారాన్ని తెరిచాక ఆభరణాలను తూకం వేసే ప్రక్రియ జరగదు. కేవలం వాటిని లెక్కించి రీసీల్ చేస్తారు.