Dasara Pooja : దుర్గాదేవి గర్జన విన్న మహిషాసురుడు..!
- By Vamsi Chowdary Korata Published Date - 06:00 PM, Wed - 1 October 25

పవిత్రమైన దుర్గాష్టమి రోజు చాలామంది కన్యా పూజ లేదా కుమారి పూజ ఆచరిస్తారు.అలాగే దుర్గాష్టమి వ్రతం ఆచరించే భక్తులు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం ఆచరించి ఇంటిని, పూజగదిని శుభ్రం చేయాలి.ఈ రోజున దుర్గాదేవికి పూలు, పండ్లు, పాయసం, చక్కెర పొంగలి వంటివి నైవేద్యంగా సమర్పించాలి.ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి హారతి ఇవ్వాలి.అలాగే దుర్గా శక్తి మంత్రాలను, దేవి ఖడ్గమాల, లేదా దుర్గా చాలీసా చదవటం, దుర్గాష్టమి వ్రత కథను చదివి అక్షతలను శిరస్సుపై వేసుకోవాలి.
పూర్వం రంభుడు అనే రాక్షస రాజు ఉండేవాడు.అతడు మహిషి (గేదె) రూపంలో ఉన్న రాక్షసిని మోహించి వివాహం చేసుకుంటాడు.వారికి జన్మించినవాడే ఈ మహిషాసురుడు.గేదె తల, మనిషి మొండెం కలిగిన ఈ రాక్షసుడు అపారమైన శక్తియుక్తులతో లోకాలను జయించాలనే కోరికతో బ్రహ్మదేవుడి కోసం కఠోర తపస్సు చేస్తాడు.మహిషాసురుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీరు కోరిన వరం ఇస్తానని హామీ ఇస్తారు.అప్పుడు మహిషాసురుడు “నాకు పురుషులు లేదా దేవతల చేతిలో మరణం లేకుండా వరం ఇవ్వండి” అని కోరుతాడు.వెంటనే బ్రహ్మ ఆ వరాన్ని ఇచ్చాడు.వరం పొందిన తర్వాత మహిషాసురుడు అహంకారంతో దేవలోకాన్ని ఆక్రమించాడు.దేవతలందరినీ నానా రకాలుగా ఇబ్బందిపెడుతుంటాడు.
మహిషాసురుడి అరాచకాలను తట్టుకోలేని దేవతలు త్రిమూర్తులకు మొరపెట్టుకుంటారు.అప్పుడు త్రిమూర్తులు, దేవతలు అందరూ బాగా మథనం చేసిన తర్వాత శక్తి, తేజస్సుతో ఒక దివ్య శక్తి ఉద్భవిస్తుంది.అనంతమైన తేజస్సుతో, అపారమైన సౌందర్యంతో ఆవిర్భవించిన ఆ శక్తే దుర్గా దేవి.
దివ్యశక్తులతో ఉద్భవించిన దుర్గాదేవికి మహిషాసురుడిని సంహరించడానికి దేవతలందరూ తమ తమ శక్తివంతమైన ఆయుధాలను సమర్పిస్తారు.అవేమిటంటే. శివుడు త్రిశూలం, విష్ణువు సుదర్శన చక్రం, వరుణుడు శంఖం, వాయుదేవుడు బాణాలు, ధనుస్సు, ఇంద్రుడు వజ్రాయుధం,హిమవంతుడు సింహం దుర్గాదేవి వాహనం ఇలా పది చేతుల్లో శక్తివంతమైన ఆయుధాలు ధరించి సింహ వాహనాన్ని అధిరోహించిన దుర్గాదేవి భయంకరమైన ఒక్క గర్జన చేసింది.. ఆ గర్జనకు ముల్లోకాలు కంపించాయి.
దుర్గాదేవి గర్జన విన్న మహిషాసురుడు ఒక స్త్రీ తనపై యుద్ధానికి వచ్చిందని గర్వంగా భావించి ఆమె శక్తిని తక్కువ అంచనా వేశాడు.తన అనుచరులను, సేనలను, రాక్షస వీరులను దుర్గాదేవిపై యుద్ధానికి పంపిస్తాడు.దుర్గాదేవి అసామాన్య పోరాట పటిమతో ఒక్కొక్క రాక్షసుడిని సంహరిస్తూ వస్తుంది.చివరగా మహిషాసురుడే యుద్ధానికి వచ్చాడు.అతనికి ఉన్న మహిమల వల్ల గేదె, సింహం, మనిషి ఇలా రూపాలు మార్చుకుంటూ అమ్మవారిని కలవరపెట్టే ప్రయత్నం చేస్తాడు.కానీ దుర్గా దేవి దివ్యశక్తితో అతని ప్రతి మాయను ఛేదిస్తూ వస్తుంది.చివరిగా మహిషాసురుడు గేదె రూపంలో ఉన్నప్పుడు ఆ రూపం నుంచి మనిషి రూపంలో బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు దుర్గాదేవి త్రిశూలాన్ని అతని గుండెలపై దింపి.. శిరస్సును ఖండిస్తుంది.అంతటితో ఆ రాక్షసుడి పీడ విరగడవుతుంది.దీంతో లోకంలో శాంతి నెలకొంటుంది.అలాగే.. మహిషాసురుడిపై దుర్గాదేవి విజయం సాధించిన రోజునే దుర్గాష్టమిగా జరుపుకుంటారు.