Grahanam Effect: గ్రహణ సమయంలో ఆలయాల్లో విగ్రహాలు శక్తి కోల్పోతాయా.. ఇందులో నిజమెంత?
Grahanam Effect: గ్రహణం సమయంలో ఆలయాలను ఎందుకు మూసివేస్తారు. నిజంగానే ఆలయాల్లో ఉన్న విగ్రహాల శక్తి కోల్పోతాయా? ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:00 AM, Mon - 6 October 25
Grahanam Effect: మామూలుగా గ్రహణం సంభవించే సమయంలో ఆలయాలను మూసివేస్తారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఈ సమయంలో అతి నీల లోహిత కిరణాలు నేరుగా భూమిపై పడతాయని, వాటి ప్రభావం వల్ల మనకు కీడు జరుగుతుందని చాలామంది నమ్ముతారు. గ్రహణ సమయంలో ఆలయాల్లో మూల విరాట్ శక్తిని కోల్పోతుందని, ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఉందని చెబుతారు.
అందుకే గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేస్తారని చెబుతారు. కాగా గ్రహణం అనేది ఖగోళ ఘటన. ఇది సూర్యుడు, చంద్రుడు, భూమి స్థానాల వల్ల సంభవిస్తూ ఉంటుంది. శాస్త్రీయంగా చెప్పాలంటే గ్రహణం ప్రభావం విగ్రహాలపై ఉండదు. ఎందుకంటే విగ్రహాలు భౌతిక వస్తువులు. వాటి శక్తి అనేది ఆధ్యాత్మిక లేదా సాంప్రదాయ నమ్మకాలపై ఆధారపడి ఉంటుందట. స్థానిక సంప్రదాయాల ప్రకారం గ్రహణ సమయంలో రాహువు లేదా కేతువు ప్రభావం వల్ల ప్రతికూల శక్తులు విజృంభిస్తాయని భావిస్తారు. అందుకే ఈ సమయంలో ఆలయాలను మూసివేయడం, పూజలు ఆపేయడం, దేవతా విగ్రహాలను కప్పి ఉంచడం వంటి ఆచారాలు కొన్ని ప్రాంతాల్లో అనుసరిస్తూ ఉంటారు.
అయితే గ్రహణ సమయంలో విగ్రహాలు శక్తిని కోల్పోతాయని చెప్పే కన్నా ప్రతికూల శక్తుల నుంచి వాటిని రక్షించడానికి జరిగే ఆచారంగా భావించవచ్చని చెబుతున్నారు. అదేవిధంగా విగ్రహాల్లో శక్తి అనేది కేవలం భక్తుల విశ్వాసం మాత్రమే. పవిత్రత, ప్రతిష్ఠాపన ద్వారా ఈ శక్తి వస్తుందని హిందూ ధర్మం చెబుతోంది. ఇకపోతే విగ్రహాలు శక్తిని కోల్పోతాయా లేదా అనేది పూర్తిగా స్థానిక నమ్మకాలపై ఆధారపడి ఉంటుందని, వీటిని నిరూపించేందుకు శాస్త్రీయ ఆధారాలు ఏమి లేవని, గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేసి శుద్ధి చేసి తెరుస్తారంటే వాటి శక్తి కోల్పోతాయని కాదు. ఇదో ఆచారం మాత్రమే అని చెబుతున్నారు.