TTD : టీటీడీ వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా..?
TTD : తాజాగా ఒక అజ్ఞాత భక్తుడు ఏకంగా 121 కిలోల బంగారాన్ని స్వామివారికి కానుకగా సమర్పించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీని విలువ సుమారు రూ. 140 కోట్లు ఉంటుందని అంచనా
- By Sudheer Published Date - 02:29 PM, Thu - 21 August 25

తిరుమల నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడుతుంది. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకుని, భక్తిశ్రద్ధలతో కానుకలు సమర్పిస్తుంటారు. శ్రీవారి హుండీ ఆదాయం నిత్యం కోట్లలో ఉంటుంది. నగదుతో పాటు బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను కూడా భక్తులు సమర్పించుకుంటారు. తాజాగా ఒక అజ్ఞాత భక్తుడు ఏకంగా 121 కిలోల బంగారాన్ని స్వామివారికి కానుకగా సమర్పించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీని విలువ సుమారు రూ. 140 కోట్లు ఉంటుందని అంచనా. ఆధునిక చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో బంగారం సమర్పించడం ఇదే మొదటిసారి. ఈ విషయం స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN) ప్రకటించడంతో ఇది వైరల్‌గా మారింది.
AP : మద్యం కేసులో కీలక పరిణామం..రాజ్ కెసిరెడ్డి ఆస్తుల జప్తునకు ఉత్తర్వులు
శ్రీవారికి ఇంత భారీ మొత్తంలో బంగారం సమర్పించిన ఆ అజ్ఞాత భక్తుడు ఎవరు అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. స్వామివారిని నమ్ముకున్న ఆ భక్తుడు ఒక కంపెనీని స్థాపించాడని, దానికి ఊహించని లాభాలు రావడంతో, కంపెనీలో 60 శాతం వాటాను విక్రయించగా ఏకంగా రూ. 7,000 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. ఇదంతా శ్రీవారి అనుగ్రహంగా భావించి, అందులో కొంత మొత్తాన్ని స్వామివారి సేవకు ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడట. శ్రీవారికి నిత్యం అలంకరించే ఆభరణాలు సుమారు 120 కిలోలు ఉంటాయని తెలిసి, దానికి ఒక కిలో ఎక్కువ అంటే 121 కిలోల బంగారం సమర్పించడం ఆ భక్తుడి విశిష్ట భక్తికి నిదర్శనం. అయితే ఆ భక్తుడి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచబడ్డాయి.
Venu Swamy : వేణుస్వామికి చేదు అనుభవం.. ఆలయం నుంచి గెంటివేత
తిరుమల శ్రీవారి ఖజానాలో ఎంత బంగారం ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. టీటీడీ లెక్కల ప్రకారం, మొత్తం 10,000 కిలోలకు పైగా బంగారం శ్రీవారి ఖజానాలో ఉంది. స్వామివారి అలంకరణ కోసం సుమారు 1,100 రకాల బంగారు ఆభరణాలు, 376 వజ్ర వైఢూర్యాల నగలు వినియోగిస్తారు. గతంలో భక్తులు సమర్పించిన బంగారు ఆభరణాలను కరిగించి విక్రయించేవారు. అయితే, 2010 నుంచి బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ప్రారంభించారు. మొదటిసారిగా 2010 మే నెలలో 1,075 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేశారు. 2022 సెప్టెంబరు నాటికి ఈ మొత్తం 10,258 కిలోలకు చేరింది. భక్తులు భారీ మొత్తంలో కానుకలు సమర్పించడానికి ముందుకు వస్తున్నందున, టీటీడీ కొన్ని నిబంధనలు విధించింది. ఇకపై ముందస్తు అనుమతులతో, నిబంధనల మేరకు మాత్రమే భారీ కానుకలు సమర్పించాలని టీటీడీ తెలియజేసింది. శ్రీవారికి ఎంత బంగారం సమర్పించినా అది ఆయన వైభవాన్ని మరింత పెంచుతూనే ఉంటుంది.