Venkateswara Swamy: శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఏ విధంగా పూజించాలో మీకు తెలుసా?
శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించేవారు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 06:30 PM, Sun - 11 August 24

హిందువులు వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. ఆరోజుల్లో ఆయా దేవుళ్ళకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి ప్రత్యేకంగా పూజిస్తుంటారు. అలా సోమవారం శివుడు మంగళవారం ఆంజనేయ స్వామి బుధవారం వినాయకుడు ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడునే పూజిస్తూ ఉంటారు. అదేవిధంగా శనివారం రోజు శనీశ్వరుడితోపాటు వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తూ ఉంటారు. శనివారం వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. కాబట్టి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజించడం వల్ల ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు.
మరి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా పూజిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేంకటేశ్వర స్వామి శ్రీ విష్ణుమూర్తి రూపాలలో ఒకడు. ఈ శ్రీనివాసుడి అనుగ్రహం పొందేందుకు చాలా మంది వేంకటేశ్వర స్వామికి గుడికి వెళ్లి కొబ్బరి కాయను కొడుతుంటారు. మరికొంతమంది ఇంట్లోనే పూజిస్తుంటారు. ప్రతి శనివారం నాడు శ్రీనివాసుడిని పూజించే భక్తులు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలట. ఇందుకోసం ముందుగా శనివారం ఉదయాన్నే లేచి స్నానం చేసి తర్వాత ఇంటిని శుభ్రపరుచుకోవాలి. దేవుడి గుడిని శుభ్రం చేసి అలంకరించుకోవాలి. ముఖ్యంగా వాకిట్లో, దేవుడి గుడి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి. మర్చిపోకుండా నుదిటిన తిరునామాన్ని ధరించాలట.
తర్వాత వేంకటేశ్వర స్వామి చిత్ర పటం లేదా విగ్రహాన్ని పూలతో అలంకరించాలి. స్వామి వారికి తులసి దళం అంటే ఎంతో ఇష్టం. అందుకే ప్రతి శనివారం పూజా సమయంలో తులసి దళంలో అర్చన చేయాలి. తర్వాత దీపాలను వెలిగించాలి. తర్వాత స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి పండ్లు, పలారాలను సమర్పించాలి. మీరు నైవేధ్యం పెట్టాలనుకుంటే పులిహోర, పాయసం, పండ్లు, చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టవచ్చు.
ఈ రోజు మీరు ఖచ్చితంగా శ్రీనివాసుడి మహత్వాన్ని తెలిపే పుస్తకాలను చదవాలి.
అదేవిధంగా వేంకటేశ్వర స్వామి నామాలను కూడా పటించాలని చెబుతున్నారు. అలాగే శనివారం సాయంత్రం కూడా స్వామి వారిని పూజించాలట.. సాయంత్రం వేళ బియ్యం పిండితో చేసిన ప్రమిదను వెళిగిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ రోజు ఒక పూట మాత్రమే భోజనం చేయాలని పండితులు చెబుతున్నారు. అలాగే ఆరోగ్యం బాగుంటే ఈ రోజు నేలపై పడుకోవలట. అలాగే శనివారం నాడు ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. మాంసాహారం తినకూడదు. శనివారం నాడు ఈ నియమాలను పాటిస్తే స్వామి వారి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుందని చెబుతున్నారు పండితులు.