Venkateswara Suprabhatam : వేంకటేశ్వర సుప్రభాతం చరిత్ర తెలుసా?
ఈ సుప్రభాతాన్ని మొదట ఎవరు ఆలపించారో తెలుసా? స్వామిని మేల్కొలిపే సంప్రదాయానికి నాంది ఎక్కడ పడిందో తెలుసా? చదవండి..
- By Dinesh Akula Published Date - 03:10 PM, Mon - 7 February 22

తొలివేకువన వినిపించే సుప్రభాత గీతం
శ్రీవారికి అదే మేల్కొలుపు గానం
భక్తులకు హృదయనాదం
ఆ దివ్యమంగళ ధ్వనికి స్వామివారి కళ్లు విచ్చుకుంటాయి
ఆయన చల్లని చూపులు లోకం మీద ప్రసరిస్తాయి
అదే శ్రీవేంకటేశ్వర సుప్రభాత గీతం.
ఇంతకీ ఈ సుప్రభాతాన్ని మొదట ఎవరు ఆలపించారో తెలుసా? స్వామిని మేల్కొలిపే సంప్రదాయానికి నాంది ఎక్కడ పడిందో తెలుసా? చదవండి..
తొలివేకువ కిరణాలు పవిత్రతిరుమల కొండపై ప్రసరించే వేళ.. భక్తులను కటాక్షించడానికి స్వామివారు యోగనిద్ర నుంచి ఉపక్రమించడానికి సిద్ధమవుతారు. ఆ బ్రహ్మముహూర్తాన అర్చకస్వాములు సుప్రభాత గీతంతో ఆయనను మేల్కొలుపుతారు. సుప్రభాతంలో వేంకటేశ్వరుడిని కౌశల్యతనయుడిగా కీర్తించారు. అందుకే కౌశల్యా సుప్రజ రామా అంటూ ఆయనను పలుకరిస్తారు.
తరతరాలుగా హైందవజాతిని జాగృతం చేస్తున్న ఈ సుప్రభాతంలో నాలుగు భాగాలుంటాయి. అలాగే సుప్రభాతంలో మొత్తం 29 శ్లోకాలున్నాయి. ఆ తర్వాత ఆలపించే 11 శ్లోకాలున్న వేంకటేశ్వర స్తోత్రం, 16 శ్లోకాలున్న వేంకటేశ్వర ప్రపత్తి, 14 శ్లోకాలున్న మంగళాశాసనాలను 15వ శతాబ్ద కాలంలో మహాముని శిష్యులైన ప్రతివాద భయంకర అణ్ణంగాచార్యులు రచించారు. అంటే.. అప్పటినుంచి స్వామి సన్నిధిలో ఈ స్తోత్రం ప్రతిధ్వనిస్తోంది. యోగనిద్ర నుంచి స్వామిని, అజ్ఞానాంధకారాల నుంచి భక్తులను మేల్కొలుపుతోంది.
ప్రతీ రోజూ బ్రహ్మ ముహూర్తాన. అంటే ఉదయం 2.30 నుంచి 3 గంటల మధ్యలో శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది. దీన్నే ప్రత్యూషకాల కైంకర్యసేవ అంటారు. గతంలో ఈ సేవ ఉదయం ఆరుగంటలకు ఉండేది. అయితే, క్రమంగా భక్తుల రద్దీ పెరగడంతో ఉదయం మూడుగంటల సమయంలో జరపడం మొదలుపెట్టారు. సుప్రభాతాన్ని తమిళంలో తిరుపళి యెళిచ్చిగా పిలుస్తారు.
అర్చకులు, అన్నమయ్య వంశీకులు, జియ్యంగార్లు, ఏకాంగులు, సన్నిధి గొల్ల వేకువఝామునే స్నానాలు చేసి తిరునామాలు ధరించి బంగారువాకిలి దగ్గరకు చేరుకుంటారు. సన్నిధి గొల్ల వాకిలి తాళాలు తీసి దివిటీతో లోపలికి ప్రవేశిస్తారు. వెంటనే బంగారువాకిలి దగ్గరున్న అన్నమాచార్య వంశీకులు మేలుకొలుపు సంకీర్తన అందుకుంటారు. హాథీరాం బావాజీ మఠం ప్రతినిధులు నవనీత హారతితో బంగారువాకిలిని పూర్తిగా తెరుస్తారు. అక్కడ ఉంచిన పాలు, చక్కెర, వెన్న, తాంబూలం గల బ్రహ్మతీర్థాన్ని జీయర్ స్వాములు, ఏకాంగి, గొల్ల స్వీకరిస్తారు. రాత్రి ఏకాంత సేవ సమయంలో మూలవిరాట్టుపై అలంకరించిన పూలను సుప్రభాత సేవ సమయంలో తీసివేస్తారు. అందుకే సుప్రభాత సేవ సమయానికి శ్రీవారి దేహంపై ఎలాంటి పూలు ఉండవు. కేవలం ఆభరణాలు ధరించిన రూపంలో దేవదేవుణ్ణి దర్శించుకోవచ్చు. శ్రీవారి పాదాలను దర్శించుకునే భాగ్యం కూడా ఈ సేవలోనే కలుగుతుంది.
వాస్తవానికి మంగళాశాసనం అనే మేల్కొలుపు గీతం రామాయణ కాలం నుంచే ఉంది అంటారు పండితులు. కౌశల్య రాముడిని అరణ్యానికి పంపే సమయంలో ఇచ్చిన మంగళమైన దీవెనల సంప్రదాయమే ఈ నాడు స్వామికి మనం కూడా కొనసాగిస్తున్నామని చెప్తారు. అసలు స్వామిని మేల్కొలపడానికి సుప్రభాతం రాయాలనే ఆలోచన కలగడానికి కారణాలను, దాని పరిణామాలను మార్కండేయ పురాణంలో చాలా స్పష్టంగా వివరించారు.
వందల ఏళ్ల నాటి వాల్మీకి రామాయణానికి, శ్రీవేంకటేశ్వర సుప్రభాతానికి చాలా దగ్గర సంబంధం ఉంది. గంగ సరయు నదీ తీరంలో నిద్రిస్తున్న రాములవారిని మేల్కొలపడానికి రామాయణంలోని బాలకాండలో ప్రస్తావించిన కౌశల్యాసుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే అనే శ్లోకాన్నే సుప్రభాతంలోని మొదటి శ్లోకంలో వర్ణించారు. శ్రీవీరప్రతాపరాయలు హయాంలో వేదపఠనంతో పాటే సుప్రభాత పఠనం కూడా మొదలైందని అంటారు.
స్వామివారికి నిత్యం జరిగే పూజల తరహాలోనే సుప్రభాత సేవ జరుగుతుంది. అవి కూడా వైఖానస ఆగమ శాస్త్రాల ప్రకారం జరగాలని నిర్దేశింపబడింది. మానవులుగా మనం ఏ పనులైతే చేస్తామో..స్వామికి కూడా అవే చేయాలని, అదీ వేదమంత్రాలతో చేయాలని శాస్త్రాల్లో నిర్దేశింపబడింది.
అసలు స్వామికి సుప్రభాతం ఎందుకు? నిజంగానే ఆయన నిద్రపోతారా?
రోజులో ఇరవై రెండున్నర గంటల పాటు సేవలు, దర్శనాలు పోను స్వామికి మిగిలిన సమయం గంట, గంటన్నర మాత్రమే. ఆ సమయంలోనే స్వామివారు సేదతీరుతారని, అది కూడా నిద్రపోవడం కాకుండా యోగనిద్రలోకి వెళ్తారని పండితులు చెబుతున్నారు. అందుకే క్షణకాలం పాటు యోగనిద్రలో ఉండే స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలుపుతాము.
కలియుగంలో వేంకటేశ్వరుడి అవతారంలో భక్తులను కటాక్షిస్తున్న ఆ స్వామి స్తోత్రప్రియుడు. ఆయన్ను ఎన్నిరకాలుగా సేవిస్తే అంత ఆనందపడతారు. అందుకే అన్నమయ్య మొదలుకొని నేటివరకూ ఎవరికీ లేనన్ని స్తోత్రాలు, పాటలు వేంకటేశ్వరస్వామిమీద రచించారు. అలాగే అప్పట్లో శ్రీవారి ఆచార్యపురుషుల్లో ఒకరైన ప్రతివాద భయంకర అణ్ణన్ ఆచార్యులు, ఆయన గురువు అయిన మణవాళ మహాముని ఆజ్ఞాపన మేరకు సుప్రభాతాన్ని రచించారు. సుప్రభాతంలో 11 శ్లోకాలున్న వేంకటేశ్వర స్తోత్రం మొత్తం భగవంతుడిని కీర్తించడానికి రాసినవి.
కౌశల్యా సుప్రజారామా అనే శ్లోకం రామాయణంలోనిది కాగా..9, 13 శ్లోకాలు మార్కండేయ పురాణంలోనివి. మార్కండేయ మహర్షి ఈ పురాణం రాయడం వెనుక కూడా ఓ కథ ఉంది. శ్రీమహావిష్ణువు అవతారమైన వేంకటేశ్వరస్వామికి ఆయన పరమభక్తుడు. ఆయన భూలోకంమీదున్న వేంకటాచలంలో యాత్ర చేయాలనుకున్న సమయంలో గరుత్మంతుడిని సంప్రదిస్తారట. ఆ సమయంలో పధ్నాలుగు భువనాల్లో వేంకటాచలం కంటే పవిత్రపుణ్యక్షేతం మరేదీ లేదని, వేంకటేశ్వరుడికంటే పూజించే దేవుడు మరొకరు లేరని గరుత్మంతుడు మార్కండేయుడికి చెప్పడంతో నేటి కపిల తీర్థంగా పిలుచుకునే ప్రదేశానికి మార్కండేయ మహర్షి చేరతారట. కొండపైనున్న సప్తతీర్థాల్లో స్నానమాచరించి అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతారట. వేంకటాచలం అంటే ఏంటో అందులోని పరమార్థం ఏంటో తెలుసుకుని ఆయన ఆశువుగా రాసిన పద్యాలే నేటి వేంకటేశ్వర సుప్రభాతంలోని భాగమైన వేంకటేశ్వరస్తోత్రం. మార్కండేయ మహర్షి వేంకటేశ్వర స్తోత్రం రాసిన చాలా ఏళ్ల తర్వాత ప్రతివాద భయంకర అణ్ణన్ ఆచార్యులు సుప్రభాతాన్ని రాశారు. వేంకటేశ్వరుడి అవతారాలల్లో ఒకటైన రంగనాథ స్వామి స్తోత్రాన్ని రాసిన శ్రీమనవల మాముని శిష్యుడే అణ్ణన్ ఆచార్యులు.